
డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్,డిసెంబర్ 22 : ప్రాచీన భారతీయ రుషుల పరంపర నుంచి వెలువడిన సనాతన క్రియాయోగ ధ్యానం సాఫల్యవంతమైన, ఆనందకరమైన జీవితాన్ని అందిస్తుందని యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు స్వామి స్మరణానంద పేర్కొన్నారు. ఈ ధ్యానం ద్వారా శారీరక వ్యాధులు తొలగిపోయి, మానసిక వికారాలు తగ్గి ఆధ్యాత్మిక జ్ఞానానికి దారితీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
స్వామి స్మరణానంద ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ ప్యారడైజ్ సమీపంలోని ఆర్య వైశ్య అభ్యుదయ సంఘం హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. క్రియాయోగం శాస్త్రీయ పద్ధతుల ఆధారంగా ఉండి, దీని అభ్యాసం ద్వారా శాస్త్రీయ ఫలితాలు సాధ్యమవుతాయని ఆయన వివరించారు. ఈ ధ్యాన పద్ధతులను క్రమపద్ధతిగా పాటిస్తే మానసిక ప్రశాంతత పొందడంతో పాటు భగవంతుని అన్వేషణలో వేగంగా పురోగతి సాధించవచ్చని చెప్పారు.

పరమహంస యోగానంద స్థాపించిన వైఎస్ఎస్ క్రియాయోగ పాఠాలు సాధకుల ఆధ్యాత్మిక అభ్యాసానికి ఎంతో ఉపయుక్త మని స్వామి స్మరణానంద గుర్తుచేశారు. వైఎస్ఎస్ పాఠాలను పాటించడం ద్వారా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక పరిపూర్ణత సాధించవచ్చని అన్నారు.
ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు, క్రియాయోగ సాధకులు పాల్గొన్నారు. కార్యక్రమం అంతటా భక్తి మయమైన వాతావరణం నెలకొంది.