
డైలీమిర్రర్ డాట్ న్యూస్, హైదరాబాద్, డిసెంబర్ 27,2024: తెలంగాణ రాష్ట్ర సెయిలింగ్ చాంపియన్‌షిప్ ఎనిమిదో ఎడిషన్ పోటీలు హైదరాబాద్ హుస్సేన్ సాగర్ జలాలపై సందడిగా సాగుతున్నాయి. శుక్రవారం రెండో రోజు పోటీల్లో టాప్ సీడెడ్ సెయిలర్లు సత్తా చాటారు.
ఆహ్లాదకరమైన వాతావరణంలో సబ్ జూనియర్ సెయిలర్లు ఆప్టిమిస్ట్ క్లాస్ ఆఫ్ బోట్లలో, జూనియర్ సెయిలర్లు ఐఎల్సీఏ4 లేజర్ క్లాస్ బోట్లలో పోటీ పడ్డారు. హైదరాబాద్ జిల్లాకు చెందిన గోవర్ధన్ పల్లార సబ్ జూనియర్ ఓవరాల్ ఆప్టిమిస్ట్ విభాగంలో స్థిరమైన ప్రదర్శనతో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు.

పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతూ స్వర్ణ పతకానికి చేరువ అవుతున్నాడు. ఇదే విభాగంలో హైదరాబాద్‌కు చెందిన దీక్షిత కొమరవెల్లి రెండు అద్భుతమైన విజయాలు సాధించింది. ఆ తర్వాత ఫామ్‌ను కోల్పోయి రెండు రేసుల్లో నిరాశ పరిచినప్పటికీ మొత్తంగా రెండో స్థానంలో కొనసాగుతోంది.
బాలికల జూనియర్ ఫ్లీట్‌లో విభాగంలోనూ దీక్షిత రెండు రేసుల్లో గెలిచినా రెండో రోజు చివరకు మూడో స్థానానికి పడిపోయింది. ఆమె సోదరి లాహిరి కొమరవెల్లి సబ్ జూనియర్ ఓవరాల్ ఆప్టిమిస్ట్ విభాగంలో మూడో స్థానంలో ఉంది.
జూనియర్ లేజర్ ఫ్లీట్‌లో నల్గొండకు చెందిన శ్రవణ్ కత్రావత్ కూడా ఒక రేసు మినహా అన్నింటినీ గెలిచి అగ్రస్థానంలో నిలిచాడు. టాప్ సీడ్ మాన్య రెండు విజయాలతో బాలికల జూనియర్ లేజర్ ఫ్లీట్‌పై తన పట్టును నిలుపుకుంది.
నల్లగుట్ట ప్రభుత్వ పాఠశాలకు చెందిన భాను రెండో స్థానంలో, పార్సీ పాఠశాలకు చెందిన జ్ఞానేశ్వరి మూడో స్థానంలో నిలిచారు.

రెండో రోజు తర్వాత పాయింట్ల పట్టిక
సబ్ జూనియర్ ఓవరాల్ ఆప్టిమిస్ట్
గోవర్ధన్ పల్లార –హైదరాబాద్ 9
దీక్షిత కొమరవెల్లి –హైదరాబాద్ 10
లాహిరి కొమరవెల్లి –హైదరాబాద్ 10
జూనియర్ బాలుర లేజర్
శ్రవణ్ కత్రావత్– నల్గొండ 3
డేనియల్ రాజ్ కుమార్– హైదరాబాద్ 8
గణేష్ పీర్కట్ల– శ్రీకాకుళం 11
జూనియర్ బాలికల లేజర్
మాన్య రెడ్డి –హైదరాబాద్ 4
తనుజా కామేశ్వర్ –హైదరాబాద్ 6
దీక్షిత కొమరవెల్లి– హైదరాబాద్ 6