డైలీ మిర్రర్ న్యూస్, అమరావతి, జూలై 31,2024: ఎర్రుపాలెం-అమరావతి నంబూరు రైల్వే లైన్ కు సంబంధించిన పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే ప్రతిపాదిత ఎర్రుపాలెం-అమరావతి నంబూరు 56.53 కి.మీ రైల్వే లైన్ కోసం భూసేకరణకు సంబంధించి రైల్వే మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కొత్త రైల్వే లైన్‌లో పెద్దాపురం, చిన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పురవూరు సహా మొత్తం తొమ్మిది రైల్వే స్టేషన్లు ఉంటాయి. వీటిలో అమరావతి ప్రధాన స్టేషన్‌గా ఉంటుంది.

శరవేగంగా పనులు..

కొత్తపేట-వడ్డమాను మధ్య కృష్ణానదిపై 3కిలోమీటర్ల పొడవైన వంతెన నిర్మాణం ఈ ప్రాజెక్టులోని ముఖ్యాంశాల్లో ఒకటి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2600 కోట్లు. ఈ కొత్త రైల్వే లైన్ మెరుగైన కనెక్టివిటీని అందజేస్తుందని, ఈ ప్రాంతంలోని కీలక ప్రాంతాల మధ్య రవాణాను సులభతరం చేస్తుందని భావిస్తున్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ప్రాంత వాసులకు ప్రయోజనం చేకూర్చేలా ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు అన్ని పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

కేంద్ర సర్కారు..

అమరావతి రైల్వేలైన్ నిర్మాణాన్నివేగంగా చేపట్టేందుకు కేంద్ర సర్కారు కసరత్తు మొదలుపెట్టింది. ఎర్రుపాలెం-నంబూరు మధ్య అమరావతి మీదుగా 56.53 కిలోమీటర్ల కొత్త బ్రాడ్జ్ లైన్ నిర్మాణాన్ని ప్రత్యేక రైల్వే ప్రాజెక్టుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కోసం ఇప్పటికే ప్రభుత్వం గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల నుంచి అవసరమైన అధికారులను(కాంపిటెంట్ అథారిటీ) నియమించింది.

ఉత్తర్వులు జారీ..

అమరావతి రైల్వేలైన్ నిర్మాణానికి సంబంధించి రైల్వేశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఉత్తర్వులు తక్షణం అమల్లోకి రానున్నాయి. గుంటూరు జిల్లా పెదకాకాని, తాడికొండ, తుళ్లూరు మండలాల్లో ఈ ప్రాజెక్టు బాధ్యతలను గుంటూరు జాయింట్ కలెక్టర్ కు అప్పగించింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో చేపట్టే పనుల బాధ్యతలను విజయవాడ ఆర్డీఓ, కంచికచర్ల, వీరులపాడు మండల బాధ్యతలను నందిగామ ఆర్డీఓ, పల్నాడు జిల్లా అమరావతి మండలంలో పనుల బాధ్యతలను సత్తెనపల్లి ఆర్డీఓ నిర్వహించనున్నారు.