డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 23,2025: సాహసాలను ఇష్టపడే నగరవాసుల కోసం కొండాపూర్‌లోని AMB శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో సరికొత్త వినోద ప్రపంచం సిద్ధమైంది. ఆసియాలోనే మొట్టమొదటి రియల్-లైఫ్ మల్టీ-థీమ్ అడ్వెంచర్ డెస్టినేషన్ ‘మ్యాజిక్ డిస్ట్రిక్ట్’ (Magic District) ఇక్కడ అధికారికంగా ప్రారంభమైంది.
కథలో మీరే పాత్రధారులు!
సాధారణ వినోద కేంద్రాలలా కాకుండా, ఇక్కడ సందర్శకులు కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోకుండా, స్వయంగా కథలో పాత్రధారులుగా మారి సాహసయాత్రలో పాల్గొనవచ్చు. మాల్లోని 6వ అంతస్తులో సుమారు 38,000 చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో దీనిని అత్యంత వినూత్నంగా రూపొందించారు.
భారతీయ సృజనాత్మకతకు నిదర్శనం
నేషనల్ అవార్డు గ్రహీత, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ హోల్డర్ తవ్వ శ్రీనివాస్ ఈ అద్భుతమైన కాన్సెప్ట్‌కు రూపకల్పన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయుల మేధస్సును ప్రపంచానికి చాటిచెప్పడమే తమ లక్ష్యమని, దేశవ్యాప్తంగా ఇలాంటి మరో 27 కాన్సెప్టులను తీసుకురానున్నట్లు తెలిపారు. తన కుమార్తె చందన లిపి అమెరికాలో ఉద్యోగం వదిలి మరీ ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామి కావడం విశేషమని ఆయన పేర్కొన్నారు.

మొదటి దశలో 4 రకాల సాహస లోకాలు:
మొత్తం ఏడు థీమ్‌లలో ప్రస్తుతం మొదటి దశలో నాలుగు రకాల అడ్వెంచర్లను అందుబాటులోకి తెచ్చారు:
జోంబీ సిటీ (Zombie City): జోంబీలు ఆక్రమించిన నగరం నుంచి తప్పించుకునే ఉత్కంఠభరిత సాహసం.
స్కేరీ ఎస్కేప్స్ (Scary Escapes): క్లూస్ వెతుకుతూ, పజిల్స్ సాల్వ్ చేస్తూ బృందంగా బయటపడాల్సిన ఇంటెలిజెంట్ గేమ్.
స్కేరీ హౌస్ (Scary House): భయంకరమైన శబ్దాలు, లైవ్ ఇంటరాక్షన్లతో కూడిన హార్డ్‌కోర్ హారర్ అనుభవం.

బూ బూ హౌస్ (Boo Boo House): పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ జోన్, వారిలో భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని పెంచేలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
నిర్వాహకుల్లో ఒకరైన కె. రాజ్ కుమార్ మాట్లాడుతూ, ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే పర్యాటకుల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. కుటుంబ సభ్యులు, పర్యాటకులు,విద్యార్థులకు ఇది ఒక మరపురాని అనుభవాన్ని మిగుల్చుతుందని సంస్థ ప్రతినిధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

