డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్, జనవరి1, 2026: హెచ్.ఎన్.జి సినిమాస్ ఎల్.ఎల్.పి బ్యానర్‌పై తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ స:కుటుంబానాం. రామ్ కిరణ్ హీరోగా, మేఘ ఆకాష్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం జనవరి 1న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, భద్రం, రచ్చ రవి, తాగుబోతు రమేష్, నిత్య శ్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఉదయ్ శర్మ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించారు. మణిశర్మ సంగీతం అందించారు.

కథ

కళ్యాణ్ (రామ్ కిరణ్) సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఉద్యోగం, కుటుంబమే అతడి జీవితం. కుటుంబాన్ని ఎవరైనా ఒక్క మాట అనినా సహించలేని వ్యక్తిత్వం అతనిది. అలాంటి కళ్యాణ్ జీవితంలోకి అతడి ఆఫీస్‌లో చేరిన సిరి (మేఘ ఆకాష్) వస్తుంది. కుటుంబమే ప్రాధాన్యం అనుకున్న కళ్యాణ్ ప్రేమలో పడటం, ఆ ప్రేమ ప్రయాణంలో ఎదురయ్యే పరిణామాలే ఈ చిత్ర కథాంశం.

విశ్లేషణ

చిత్రం తొలి భాగం కుటుంబ సన్నివేశాలు, ఆఫీస్ నేపథ్యంలో నడిచే హాస్య ఘట్టాలతో సాగుతుంది. బ్రహ్మానందం, సత్య, భద్రం కలిసి పండించిన కామెడీ ఆకట్టుకుంటుంది. హీరో–హీరోయిన్ మధ్య ప్రేమ కథ సహజంగా సాగుతుంది. రాజేంద్ర ప్రసాద్‌తో హీరోకి మధ్య వచ్చే సన్నివేశాలు మంచి భావోద్వేగాన్ని పండిస్తాయి. ఊహించని ఇంటర్వెల్ మలుపు చిత్రానికి ప్రధాన ఆకర్షణ.

రెండో భాగంలో భావోద్వేగాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ ప్రేక్షకులను ఆసక్తిగా కూర్చోబెడతాయి. దర్శకుడు ఉదయ్ శర్మ కథను ఆసక్తికరంగా చెప్పడంలో విజయవంతమయ్యారు. ముఖ్యంగా కథనం ఎక్కడా ల్యాగ్ లేకుండా సాగుతుంది.

హీరో రామ్ కిరణ్ తొలి చిత్రంలోనే ఉత్సాహంగా నటించాడు. కొత్తవాడిలా కాకుండా అనుభవం ఉన్న నటుడిలా కనిపించాడు. యాక్షన్ సన్నివేశాల్లోనూ మెప్పించాడు. మేఘ ఆకాష్ తన పాత్రకు తగ్గట్టుగా అందంగా కనిపించింది. రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం తమ అనుభవంతో సినిమాకు బలమిచ్చారు.

సాంకేతిక విభాగం

మణిశర్మ అందించిన పాటలు, నేపథ్య సంగీతం చిత్రానికి ప్లస్ పాయింట్. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ భావోద్వేగాలను బలపరుస్తుంది. శశాంక్ మలి, శివ శర్వాణి ఎడిటింగ్ చక్కగా ఉంది. కెమెరామెన్ మధు దాసరి విజువల్స్ ఆకట్టుకుంటాయి. ప్రొడక్షన్ విల్యూస్ రిచ్‌గా ఉన్నాయి.

కొత్త కథతో వచ్చిన స:కుటుంబానాం కుటుంబ సమేతంగా చూసే చిత్రంగా నిలుస్తుంది. రెండు గంటల పాటు వినోదం, భావోద్వేగాలను అందించే ఈ సినిమా కొత్త ఏడాదిలో ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇది సరైన ఎంపిక.

రేటింగ్: 3/5