
డైలీ మిర్రర్ డాట్ న్యూస్,నవంబర్ 30,2024: ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ గిరిజనుల జీవనశైలి మార్చేందుకు, వారికి సుస్థిర ఆర్థిక ప్రగతి చూపించే దిశగా ఒక సరికొత్త ప్రణాళికను రూపొందిస్తోంది. ఈ ప్రాజెక్టు ఉప ముఖ్యమంత్రి, అటవీ,పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనల ఫలితంగా రూపొందనుంది.
అటవీ ఉత్పత్తుల గుర్తింపుతో పాటు, కార్పొరేట్ స్థాయి మార్కెటింగ్ ద్వారా అడవిబిడ్డల జీవన స్థితిగతులు మెరుగుపర్చేందుకు పట్టిష్ట ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ది సంస్థ (APFD), ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐ.ఎస్.బి.) ఆధ్వర్యంలోని భర్తీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ సంస్థలు మధ్య ఒక అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంపై మూడు సంస్థల ప్రతినిధులు శుక్రవారం అటవీశాఖ ప్రధాన కార్యాలయంలో సంతకం చేశారు.

ఈ ఒప్పందం ప్రకారం, అడవుల్లో దొరికే సహజ సిద్ధమైన సీజనల్ ఉత్పత్తుల గుర్తింపు, సేకరణ, మార్కెటింగ్ పై దృష్టి సారించనున్నారు. పర్యావరణాన్ని కాపాడుతూ, డిజిటల్, జియోస్పేషియల్ సాంకేతికత ఆధారంగా అరుదుగా దొరికే ఉత్పత్తులను గుర్తించడం ప్రధాన ఉద్దేశ్యం. ఈ ప్రాజెక్టు ద్వారా, స్థానిక గిరిజనులను, ముఖ్యంగా గిరిజన మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం లక్ష్యం.
ఈ ప్రాజెక్టు ద్వారా, కలప ఉత్పత్తుల మినహాయించుకుని, ఇతర నాణ్యమైన అటవీ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించి మార్కెటింగ్ చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ పి.సి.సి.ఎఫ్. ,హెచ్.ఓ.ఎఫ్.ఎఫ్. చిరంజీవ్ చౌదరి మాట్లాడుతూ, ‘‘ఈ ఒప్పందం అటవీ ఆర్థిక ప్రగతికి గేమ్ ఛేంజర్ అవుతుంది. అటవీ ఉత్పత్తుల ద్వారా సంపద సృష్టి భారీగా పెరుగుతుంది. 40 శాతం మంది గిరిపుత్రులు ఇప్పటికీ అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా వారి జీవన స్థితి మెరుగుపడుతుంది’’ అన్నారు.

భర్తీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ఈడీ అశ్వనీ ఛత్రే మాట్లాడుతూ, ‘‘ఈ ప్రాజెక్టు లక్ష్యం, అటవీ ఉత్పత్తుల నుంచి వచ్చే ఆదాయం గిరిజనులకు చేకూర్చడం. ఈ ప్రాజెక్టు ద్వారా అటవీ ఉత్పత్తుల గుర్తింపు, మార్కెటింగ్, సప్లై ఛైన్ ఏర్పాటు, కొత్త అవకాశాలు సృష్టించడం అనేది ప్రధాన ఉద్దేశ్యం’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ ఎం.డి. రాజేంద్ర ప్రసాద్ కజూరియా కూడా పాల్గొన్నారు.