డైలీ మిర్రర్ డాట్ న్యూస్,ముంబై,8 అక్టోబర్ 2024: ప్రపంచ బ్యాంక్ గ్రూప్‌లో భాగమైన,అతి పెద్ద గ్లోబల్ డెవలప్‌మెంట్ సంస్థ అయిన ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ) భారతదేశంలో ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం అయిన యాక్సిస్ బ్యాంకుతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా భారత్‌లో బ్లూ ఫైనాన్స్ మార్కెట్‌ను అభివృద్ధి చేయడంలో, గ్రీన్ ప్రాజెక్టులకు రుణ లభ్యతను పెంచడంలో సహాయం చేస్తూ 500 మిలియన్ డాలర్ల రుణం సమకూర్చేందుకు ఈ జట్టు ముందుకు వచ్చింది.
భారత్‌లో ఐఎఫ్‌సీకి ఇది తొలి బ్లూ ఇన్వెస్ట్‌మెంట్ కాగా, దేశంలో ఆర్థిక సంస్థలు చేపట్టిన తొలి బ్లూ లావాదేవీ కూడా. నీటి,వ్యర్ధజలాల నిర్వహణ, మెరైన్ ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడం, మెరైన్ ఎకోసిస్టమ్‌ల పునరుద్ధరణ, సుస్థిర షిప్పింగ్, పర్యావరణ అనుకూల టూరిజం,ఆఫ్‌షోర్ పునరుత్పాదక శక్తి వంటి రంగాలలో పెట్టుబడుల కోసం సేకరించే ఆర్థిక సాధనాలను బ్లూ లోన్స్‌గా పరిగణిస్తారు.
ఈ భాగస్వామ్యం భారతదేశంలో ఐఎఫ్‌సీకి చేసిన అతి పెద్ద గ్రీన్ ఫైనాన్సింగ్ కూడా కావడం విశేషం. యాక్సిస్ బ్యాంకు ఈ నిధులను తమ క్లైమేట్ ఫైనాన్స్ పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు ఉపయోగించనుంది.
భారత్‌లో పట్టణీకరణ,ఆర్థిక వృద్ధి వేగవంతమవుతున్న నేపథ్యంలో నీరు మరియు శక్తి సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు గొప్ప అవకాశాలు ఉన్నాయి. 2022 నాటికి నీరు, వ్యర్ధజలాల ట్రీట్‌మెంట్ మార్కెట్ పరిమాణం 1.6 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2029 నాటికి ఇది 3 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుతుందని అంచనాలు ఉన్నాయి.
సుస్థిర మౌలిక సదుపాయాల అవసరం పెరుగుతున్న నేపథ్యంలో, 2030 నాటికి హరిత భవనాల రంగంలో 1.4 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నట్లు సూచనలు ఉన్నాయి. ఈ పెరిగే పెట్టుబడులను ప్రైవేట్ రంగం ద్వారా తీర్చుకోవాల్సిన అవసరం ఉందని ఐఎఫ్‌సీ చెబుతోంది.
“గ్లోబల్ ఎకోసిస్టమ్‌లో వాతావరణ మార్పుల ప్రభావాలు పెరుగుతున్న తరుణంలో, బ్యాంకులు సుస్థిర రుణ విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఐఎఫ్‌సీతో జట్టు కట్టడం ద్వారా, పర్యావరణహిత ఫైనాన్స్‌ను ప్రోత్సహించే దిశగా రుణాల విధానాలను, ప్రమాణాలను బలపర్చే లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం” అని యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమితాబ్ చౌదరి తెలిపారు.
“భారత్‌లో తొలి బ్లూ లోన్‌ను ప్రవేశపెడుతున్నాం. ఇది ఇప్పటివరకు మేము చేపట్టిన క్లైమేట్ ఫైనాన్స్‌కు సంబంధించిన అతి పెద్ద కార్యక్రమం. భారత్ ఒక ఆసాధారణ కార్యక్షేత్రంగా ఉంటూ, సుస్థిర బ్లూ ఎకానమీని పెంపొందించేలా దీర్ఘకాలిక నిధుల లభ్యతను పెంచడంలో ఈ రుణం సహకరిస్తుంది.
ఈ కార్యక్రమం వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడంలో, ఉద్యోగాల సృష్టి, హరిత భవంతులపై దృష్టి పెట్టి భారతదేశంలో క్లైమేట్ ప్రాజెక్టులకు రుణ లభ్యతను మెరుగుపర్చేందుకు మార్గం కల్పిస్తుంది” అని ఐఎఫ్‌సీ మేనేజింగ్ డైరెక్టర్ మఖ్తార్ దియోప్ తెలిపారు.
భారత్‌లో ఐఎఫ్‌సీ పరిగణించే ఒక ప్రధాన భాగస్వామిగా యాక్సిస్ బ్యాంకు ఈ వాతావరణ సంబంధిత ఫైనాన్సింగ్ చర్యలకు మద్దతు ఇస్తూ, ఐఎఫ్‌సీ EDGE (ఎక్సలెన్స్ ఇన్ డిజైన్ ఫర్ గ్రేటర్ ఎఫీషియెన్సీస్) ప్రమాణాలకు అనుగుణంగా హరిత భవంతుల పోర్ట్‌ఫోలియోను పెంచేందుకు సహాయపడుతుంది.
ఇతర గ్రీన్ ఫైనాన్స్ రంగాలలో ఐఎఫ్‌సీకి గల విజయవంతమైన ట్రాక్ రికార్డు ఆధారంగా, ప్రపంచవ్యాప్తంగా బ్లూ ఫైనాన్స్ విస్తరించేందుకు ఐఎఫ్‌సీ సన్నాహాలు చేస్తోంది. 2020 నుంచి ప్రైవేట్ సంస్థలకు 1.9 బిలియన్ డాలర్లకు పైగా బ్లూ లోన్స్,బాండ్లను అందించింది.