డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్, జూలై 1,2025 :తెలంగాణ బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్. రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జరిగిన ఎన్నికల వేడుకలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మరియు నూతన అధ్యక్షుడు రామచంద్రరావు ప్రసంగించారు.

పార్టీ ఐక్యత, భవిష్యత్ లక్ష్యాలపై ఇరువురు నేతలు కార్యకర్తలకు కీలక దిశానిర్దేశం చేశారు. రామచంద్రరావు నాయకత్వంలో తెలంగాణలో కాషాయ జెండాను ఎగరేస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు.

బండి సంజయ్ ప్రసంగం: ‘రామచంద్రరావు మిస్సైల్’

రాష్ట్ర నూతన అధ్యక్షులు రామచంద్రరావుకు శుభాకాంక్షలు తెలిపిన బండి సంజయ్, ఆయన నేపథ్యాన్ని కొనియాడారు. “ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, ఏబీవీపీ నాయకుడిగా, బీజేపీలో కిందిస్థాయి నుండి అనేక బాధ్యతలు నిర్వర్తించిన, కష్టపడి కమిట్ మెంట్ తో పనిచేసే నాయకుడు రామచంద్రరావు” అని ప్రశంసించారు.

ట్రోలింగ్ కు చెక్: రామచంద్రరావుపై సోషల్ మీడియాలో కావాలనే ట్రోల్ చేస్తున్నారని, గతంలో మోదీసహా తమందరిపైనా ఇలానే ట్రోల్ చేశారని, అయితే ట్రోల్ చేసిన వాళ్లే కాలగర్భంలో కలిసిపోయారని సంజయ్ పేర్కొన్నారు. “రామచంద్రరావు మిస్సైల్” అని అభివర్ణించారు.

ఏబీవీపీలో ఉండగా రాడికల్స్ చేసిన దాడుల వల్లే రామచంద్రరావుకు గాయాలయ్యాయని, ఆ విషయం తెలిసి తన కళ్లల్లో నీళ్లు తిరిగాయని సంజయ్ వెల్లడించారు. విద్యార్థి దశలోనే కాషాయ జెండాను రెపరెపలాడించి అధికారం కోసం పోరాడిన నాయకుడని గుర్తు చేశారు. నక్సలైట్లు పోస్టర్లు వేస్తే భయపడి పారిపోతున్న ఆ రోజుల్లో ఎదురొడ్డి పోరాడిన త్యాగశీలి రామచంద్రరావు అని కొనియాడారు.

పార్టీ క్రమశిక్షణ – లక్ష్యాలు: అధ్యక్షుడు కావాలని ఎవరైనా ఆశించవచ్చని, అయితే హైకమాండ్ నిర్ణయం తీసుకున్న తర్వాత తప్పకుండా పాటించాల్సిందేనని సంజయ్ స్పష్టం చేశారు. ప్రజాసంగ్రామ యాత్ర సమయంలో బీఆర్ఎస్ గూండాలు తమపై అనేక దాడులు చేసినా, కార్యకర్తలే కంటికి రెప్పలా కాపాడుకున్నారని తెలిపారు.

కార్యకర్తలపై, తమపైన కేసులు పెట్టి జైళ్లకు పంపితే కోర్టులో వాదించి బయటకు తీసుకొచ్చింది రామచంద్రరావే అని గుర్తు చేశారు.

“మన లక్ష్యం… మోదీ రాజ్యం, రామరాజ్యం రావాల్సిందే… గొల్లకొండపై కాషాయ జెండా ఎగరేయాల్సిందే” అని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. “అందరికీ ఇచ్చాం అవకాశం… బీజేపీకి ఇద్దాం అవకాశం…అని సామాన్య ప్రజలంతా భావిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఔట్… బీజేపీకి అధికారం పక్కా” అని పునరుద్ఘాటించారు.

ప్రత్యర్థులపై విమర్శలు: దేశానికి బీసీని ప్రధానమంత్రి చేసిన ఘనత బీజేపీకే ఉందని, ఆ దమ్ము కాంగ్రెస్ కు లేదని బండి సంజయ్ అన్నారు. దళిత, ఆదివాసీ బిడ్డలను రాష్ట్రపతులుగా చేసింది ఒక్క బీజేపీనే అన్నారు.

లక్ష్మణ్, దత్తాత్రేయ, చలపతిరావు వంటి బీసీలను అధ్యక్షులుగా చేసింది బీజేపీయేనని గుర్తు చేశారు. “దళితుడిని సీఎం చేయకుంటే తల నరక్కుంటానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్… మాట మార్చి దళితులను మోసం చేయలేదా?” అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేసే దమ్ముందా అని సవాల్ విసిరారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు తమకు సమాన ప్రత్యర్థులేనని సంజయ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలన అంతా అవినీతిమయమని అమిత్ షాయే చెప్పారని, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, విద్యుత్ కొనుగోళ్లు, ఫార్ములా ఈరేసు, గొర్రెల స్కాం సహా అన్ని అక్రమాలే జరిగాయని ఆరోపించారు.

అయినా బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి జైళ్లో వేసే దమ్ము కాంగ్రెస్కు లేదన్నారు. “బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ కుటుంబాన్ని కటకటాల్లోకి నెట్టేవాళ్లం” అని వ్యాఖ్యానించారు. జడ్జీల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేస్తే సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నిస్తూ, సీబీఐ విచారణ జరిపితే బీఆర్ఎస్, కాంగ్రెస్ బండారం బయటపడుతుందని రేవంత్ రెడ్డి భయపడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు, 420 హామీలను గాలికొదిలేశారని విమర్శించారు.

భవిష్యత్ కార్యాచరణ: కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనలో అందరం పోరాడదామని పిలుపునిచ్చారు. కలిసికట్టుగా పనిచేస్తే తెలంగాణలో వంద సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. బీజేపీలో ఏ గ్రూపులుండవని, తమందరిదీ ఒకటే గ్రూప్ అని, నరేంద్ర మోదీ తమ టీం కెప్టెన్ అని, తామంతా ఆ టీం సభ్యులమేనని ఐక్యతా సందేశం ఇచ్చారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రౌండ్ను ప్రిపేర్ చేసింది, పార్టీ సభ్యత్వ నమోదులోనూ కష్టపడి పనిచేసింది రామచంద్రరావేనని కితాబిచ్చారు. రామచంద్రరావు నాయకత్వంలో ప్రతి బీజేపీ కార్యకర్త పనిచేయాలని కోరారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ ట్రాప్లో పడొద్దని కార్యకర్తలను కోరుతూ, రాబోయే స్థానిక ఎన్నికల్లో, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాషాయ జెండాను ఎగరేద్దామని ఉద్ఘాటించారు.

రామచంద్రరావు ప్రసంగం: ‘నేనెప్పటికీ కార్యకర్తనే’

బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ఎన్. రామచంద్రరావు మాట్లాడుతూ, “నేను పేరుకే అధ్యక్షుడిని…. నేనెప్పటికీ కార్యకర్తను… మీ సేవకుడినే” అని వినమ్రంగా ప్రకటించారు. “కార్యకర్తలే ఈ పార్టీకి నిజమైన సారథులు” అని వారి అంకితభావాన్ని కొనియాడారు.

పార్టీ ప్రస్థానం – త్యాగాల స్మరణ: ఉమ్మడి ఏపీలో జనసంఘ్ అభ్యర్థి పోటీచేస్తే కేవలం వెయ్యి ఓట్లు మాత్రమే వచ్చినా, కమ్యూనిస్టు పార్టీ గెలిచినా, నాటి కార్యకర్తలు టపాసులు కాల్చారని గుర్తు చేశారు. గత ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయని ఆనాడు సంబురాలు చేసుకున్నారని తెలిపారు.

“నేడు అదే ఉత్సాహంతో తెలంగాణలో 8 ఎమ్మెల్యే, 8 ఎంపీ, 3 ఎమ్మెల్సీ సీట్లను కైవసం చేసుకున్నాం” అని పార్టీ సాధించిన విజయాలను వివరించారు.

పార్టీ కోసం సైకిల్ పై రాష్ట్రమంతటా తిరుగుతూ ఎంతో కష్టపడ్డామని, ఈ స్థాయికి వచ్చిందంటే ఎంతో మంది కార్యకర్తల, నాయకుల త్యాగాలున్నాయని పేర్కొన్నారు. “మీ చెమట కష్టంతోనే బీజేపీ ఎదిగింది” అని స్పష్టం చేశారు.

అందరి ఆశీస్సులతో తాను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికవడం గర్వంగా ఉందని, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికవడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. “నక్సలైట్ల తూటాలకు బలైన బీజేపీ నాయకుల బలిదానాల వల్లే పార్టీ ఈ స్థాయికి ఎదిగింది” అని త్యాగాలను స్మరించారు.

“బీజేపీ మాస్ క్యాడర్ పార్టీ… సిద్ధాంత బలమున్న పార్టీ” అని ఉద్ఘాటించారు. “కలిసికట్టుగా గొల్లకొండ కోటపై కాషాయ జెండా ఎగరేద్దాం” అని లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు.

కొత్తతరం – నూతన లక్ష్యాలు: “బీజేపీలో కొత్త, పాత అనే పంచాయతీ లేదు. నది ప్రవహించాలంటే కొత్త నీరు రావాల్సిందే” అని యువతను, కొత్తవారిని పార్టీలోకి ఆహ్వానించారు.

తెలంగాణ యువత రాజకీయాల్లోకి రావాల్సిందేనని పిలుపునిచ్చారు. యువకులు, మహిళలు బీజేపీలోకి రావాలని, 33 శాతం రిజర్వేషన్ల అమలుతో మహిళలకు ఎన్నో అవకాశాలు రాబోతున్నాయని అన్నారు.

“తెలంగాణ ప్రజలంతా బీజేపీవైపు చూస్తున్నారు” అని ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని ప్రతిజ్ఞ చేశారు.

ఫేక్ న్యూస్ కు చట్టపరమైన హెచ్చరిక: “బీఆర్ఎస్, కాంగ్రెస్ వాట్సాప్ వర్శిటీలను పెట్టుకుని ఫేక్ న్యూస్ ను ట్రోలింగ్ చేస్తున్నారు” అని విమర్శించారు. స్వామి వివేకానంద చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుని పోరాడదామని పిలుపునిచ్చారు. “మీకు దమ్ముంటే… నేరుగా ఎదురుగా పోరాడదాం రండి.

మీరు దమ్ములేని పిరికిపందలు కాబట్టే వెనుకుండి ఫేక్ న్యూస్ ట్రోల్ చేస్తున్నారు” అని సవాల్ విసిరారు. “నేను క్రిమినల్ లాయర్ ను…. ఫేక్ న్యూస్ సూత్రధారులను బోనులో నిలబెట్టేందుకు వెనుకాడను” అని హెచ్చరించారు.

పోరాట స్ఫూర్తి – భవిష్యత్ ప్రణాళిక: “రామచంద్రరావు సౌమ్యుడు కాదు… ఏబీవీపీగా ఉన్నప్పుడే జైలుకు వెళ్లొచ్చినోడిని. పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నోడిని. కాళ్లు, చేతులు విరగ్గొట్టుకున్నా సిద్ధాంతాన్ని వీడకుండా పనిచేసినోడిని” అని తన పోరాట నేపథ్యాన్ని గుర్తు చేశారు.

“నేను సౌమ్యుడినే.. యుద్ధంలోకి దిగితే యోధుడినే… కత్తి దూయడంలో ముందుంటా” అని తన దృఢత్వాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థులు, న్యాయవాదులతో, పేదల పక్షాన న్యాయ పోరాటం చేసిన వ్యక్తిగా, ఇకపై తెలంగాణ ప్రజల పక్షాన అలుపెరగని పోరాటాలకు సిద్ధమని అన్నారు. “కలిసికట్టుగా అందరితో కలిసి పనిచేస్తా.. బీజేపీని అధికారంలోకి తీసుకొస్తా” అని ప్రసంగాన్ని ముగించారు.