డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్, అక్టోబర్ 25, 2024:హరిత టెక్నాలజీలో అగ్రగామి అయిన బ్లూజే ఏరో సంస్థ నిట్టనిలువుగా టేకాఫ్ తీసుకుని, అలాగే ల్యాండింగ్ అవ్వగల (వీటీఓఎల్) విమానాన్ని హైదరాబాద్ సమీపంలోని నాదర్‌గుల్ ఎయిర్‌ఫీల్డ్‌లో లైవ్‌గా ప్రదర్శించింది. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్-ఎలక్ట్రిక్ వీటీఓఎల్‌ను రూపొందించిన ఘనత ఈ సంస్థకు దక్కుతుంది. ఇది అత్యాధునిక అటానమస్, కాలుష్య రహిత ప్రాంతీయ విమానం కావడం విశేషం.
హైడ్రోజన్-ఎలక్ట్రిక్ ప్రొపల్షన్, అటానమస్ ఫ్లైట్ టెక్నాలజీలలో బ్లూజే ఏరో శక్తి సామర్థ్యాలను ఈ ప్రదర్శన నొక్కిచెప్పింది. ఇది ఏరోస్పేస్ పరిశ్రమ, వెంచర్ క్యాపిటల్ సంస్థల నుంచి కీలక వాటాదారులను ఆకర్షించింది. సరకు, ప్రయాణికుల రవాణా రెండింటికీ రీజనల్ ఎయిర్ మొబిలిటీని పునర్నిర్వచించడంలో కంపెనీ ప్రధాన పాత్రను ప్రదర్శించింది. బెంగళూరు-మైసూరు, చెన్నై-పాండిచ్చేరి, ముంబై-పుణె, హైదరాబాద్-వరంగల్ వంటి కీలక నగరాల మధ్య సంప్రదాయ విమానాశ్రయాలు ఏవీ అక్కర్లేకుండానే 30 నిమిషాల్లో వెళ్లిపోయేందుకు బ్లూజే ఏరో టెక్నాలజీ దోహదపడుతుంది.
బ్లూజే ఏరో రీచ్: మిడ్ మైల్ లాజిస్టిక్స్‌లో గేమ్ ఛేంజర్
బ్లూజే ఏరో రీచ్ అనే ఒక కొత్త విమానాన్ని ప్రదర్శించింది. ఇది మానవరహిత సరకు రవాణా విమానం. ఎక్కువ దూరానికి భారీ బరువు ఉండే సరకులను సులభంగా తీసుకెళ్తూ, అదే సమయంలో కాలుష్యం లేకుండా చూడడం దీని ప్రత్యేకత. ఈ విమానం ప్రాంతీయ వాయు రవాణా ముఖచిత్రాన్నే మార్చేస్తుంది.
ఈ సందర్భంగా బ్లూజె ఏరో సహ వ్యవస్థాపకుడు, సీటీవో ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ.. “సుస్థిర సాంకేతిక పరిజ్ఞానంతో వైమానిక చలనశీలతను మార్చాలన్న మా విజన్ లో ఈ తొలి విమానం ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ప్రొపల్షన్ ,స్వయంప్రతిపత్తిలో భారతీయ ఆవిష్కరణలను ప్రదర్శిస్తూ హైడ్రోజన్-ఎలక్ట్రిక్ వీటిఓఎల్ విమానాలను నిర్మిస్తున్నందుకు మేము గర్విస్తున్నాము. సివిల్, డిఫెన్స్ రంగాలకు వేగవంతమైన, హరిత, వాణిజ్యపరంగా ఆచరణీయమైన విమాన రవాణాను అందుబాటులోకి తేవడమే మా లక్ష్యం. నేటి కార్యక్రమం ఆ కలను సాధించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు. మా బృందం, పెట్టుబడిదారులు, సలహాదారులు, వినియోగదారులు, నియంత్రణ భాగస్వాముల మద్దతుతో ఈ అత్యాధునిక సాంకేతికతను మార్కెట్లోకి తీసుకురావడానికి మేము కట్టుబడి ఉన్నాము” అని చెప్పారు.
ఇందులో..
• తీసుకెళ్లగల సామర్థ్యం: 100 కేజీలు
• రేంజి: హైడ్రోజన్-ఎలక్ట్రిక్ ప్రొపల్షన్‌తో ఒక సింగిల్ ఛార్జితో 300 కిలోమీటర్లు
• ఫ్లైట్ మోడ్: రియల్ టైం మానిటరింగ్, కంట్రోల్‌తో పూర్తి స్వతంత్రం.
• కాలుష్యరహితం: బ్లూజే ఏరో వారి సొంత హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ సిస్టమ్ ఆధారితం
రీచ్ విమానం నిట్టనిలువుగా టేకాఫ్ తీసుకోవడం, ల్యాండింగ్ అయ్యే సామర్థ్యం వల్ల ఇప్పటివరకు విమానాలు వెళ్లని ప్రాంతాలకు కూడా దీని కనెక్టివిటీ వస్తుంది. దేశవ్యాప్తంగా ఎక్కడైనా అదేరోజు డెలివరీ ఇవ్వచ్చు. దీనివల్ల మిడ్-మైల్ లాజిస్టిక్స్ మార్కెట్‌లో దీన్ని అగ్రగామిగా నిలుపుతుంది. ఈ-కామర్స్‌తో పాటు అత్యధిక విలువ ఉన్న వస్తువుల రవాణాలో భారతీయ లాజిస్టిక్స్ నెట్‌వర్క్ స్థానాన్ని బలోపేతం చేస్తుంది.
ప్రధాన విజయాలు, విజన్:
- భారతదేశపు మొట్టమొదటి శక్తివంతమైన వీటీఓఎల్: బ్లూజే ఏరో విమానాలు భారతదేశంలో డిజైన్ చేసిన, తయారుచేసిన మొదటి హైడ్రోజన్-ఎలక్ట్రిక్ వీటీఓఎల్‌లు. ఇవి హరిత ఇంధన ప్రొపల్షనన్, అటానమస్ ఫ్లైట్‌లో భారతీయ ఆవిష్కరణలను ప్రదర్శిస్తాయి.
- ప్రైవేటుగా నిర్మించిన అతిపెద్ద విమానం: సుమారు 500 కిలోల ఏయూడబ్ల్యూతో ప్రదర్శించిన ఈ విమానం భారతదేశంలో ప్రైవేటుగా అభివృద్ధి చేసినవాటిలో అతిపెద్దది. ఇది ఏరోస్పేస్ స్టార్టప్ ఎకోసిస్టం పురోగతిని సూచిస్తుంది.
- ప్రొప్రైటరీ జెన్ 1 ఫ్యూయల్ సెల్ గ్రౌండ్ టెస్టింగ్: ఈ కార్యక్రమం బ్లూజే ఏరో వారి యాజమాన్య జెన్ 1 హైడ్రోజన్-ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ వ్యవస్థను ప్రదర్శించింది, ఇది జీరో-ఎమిషన్, లాంగ్-రేంజ్ విమానాలను అనుమతిస్తుంది.
- ప్రయాణికులు, సరకులకు: ప్రస్తుతం ఉన్న రోడ్డు రవాణాలో ఉన్న లోటును భర్తీ చేయడం ద్వారా రీజనల్ మొబిలిటీని పునర్నిర్మించడం
రక్షణ అవసరాల కోసం అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లో బహుళ ఉపయోగాల కోసం కూడా బ్లూజే ఒక విమానాన్ని రూపొందిస్తోంది. ఇది ప్రధానంగా సహాయ కార్యక్రమాలతోపాటు సమస్యాత్మక, మారుమూల ప్రాంతాల్లో సైనికులకు నిత్యావసరాలు కూడా అందిస్తుంది. క్లిష్ట పరిస్థితుల్లో పనిచేయడం, ఇతరత్రా విమానాలు చేరుకోలేని ప్రాంతాలకు నిత్యావసర సరకులను అందించడం ఈ విమానం సమర్థతను, రక్షణ కార్యకలాపాల్లో దాని బహుముఖతను, కీలక పాత్రను చూపిస్తుంది.
బ్లూజే ఏరోకు పలు ప్రధాన వెంచర్ క్యాపిటల్ సంస్థల మద్దతు ఉంది. వాటిలో ఎండియా పార్టనర్స్, ఐడియాస్ప్రింగ్ క్యాపిటల్, జెరోదా వారి రెయిన్‌మ్యాటర్ క్యాపిటల్ సంస్థలు ఉన్నాయి.
ఈ సందర్భంగా ఐడియాస్ప్రింగ్ క్యాపిటల్ యాజమాన్య భాగస్వామి, వ్యవస్థాపకుడు నాగానంద్ దొరస్వామి మాట్లాడుతూ, “ఈ విమానాలకు అపార సామర్థ్యం ఉంది. దీనివల్ల ప్రాంతీయ ఎయిర్ మొబిలిటీ మార్కెట్‌లో ఇది మంచి స్థానం సంపాదిస్తుంది. ఐడియాస్ప్రింగ్ క్యాపిటల్ విశ్వసించే మేక్ ఇన్ ఇండియా ఫర్ వరల్డ్ చొరవతో ఇవి జత అయ్యాయి. అధునాతన విమానయాన సాంకేతిక పరిజ్ఞానంలో నాయకత్వం వహించే మన దేశ సామర్థ్యాన్ని ఇవి ప్రదర్శిస్తాయి. తమ సొంతదైన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సిస్టంను ప్రయోగించి చూడడం ద్వారా.. బ్లూజే ఏరో సంస్థ కాలుష్య రహిత విమాన ప్రయాణాల్లో సరికొత్త శకానికి నాందీవాచకం పలికినట్లయింది” అని తెలిపారు.