డైలీ మిర్రర్ డాట్ న్యూస్, అమరావతి, మార్చి 5,2026: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర మరోసారి ఘాటుగా స్పందించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. ప్రాథమిక పదార్థాలైన పాలు, వెన్న లేకుండానే నెయ్యిని తయారు చేయగల ‘వింత విద్య’ ఒక్క వైసీపీ నాయకులకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని ఆయన ఈ సందర్భంగా ఎండగట్టారు.
నివేదికలు స్పష్టం చేసినా సమర్థించుకుంటారా..?
తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు, వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నట్లు ఎన్డీడీబీ (NDDB) నివేదికలు పక్కాగా ధ్రువీకరించాయని ధూళిపాళ్ల గుర్తుచేశారు.
ఈ పాపంలో చేతులు కలిపిన వారికి చేరిన అక్రమ సొమ్ము వివరాలను కూడా ఆయన బయటపెట్టారు. కల్తీ నెయ్యి దందా ద్వారా సుమారు రూ. 12.5 కోట్లు విజయవాడకు, రూ. 7.5 కోట్లు చెన్నైకి అక్రమంగా తరలినట్లు సిట్ (SIT) విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు.
ధరపై సూటి ప్రశ్న..
“బహిరంగ మార్కెట్లో వెన్న ధర కిలో రూ. 360 పలుకుతుంటే.. కేవలం రూ. 316కే నెయ్యిని ఎలా సరఫరా చేయగలిగారు?” అని వైసీపీ నేతలను ధూళిపాళ్ల నిలదీశారు. ఇంతటి భారీ వ్యత్యాసం వెనుక ఉన్న రహస్యం కల్తీయేనని ఆయన ధ్వజమెత్తారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్న వైసీపీ, తక్షణమే తమ తప్పును ఒప్పుకుని ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వ హయాంలో తనను 33 రోజుల పాటు అక్రమంగా జైల్లో పెట్టి, సంగం డెయిరీ సర్వర్లను హ్యాక్ చేయడానికి ప్రయత్నించారని ధూళిపాళ్ల గుర్తు చేశారు. అణువణువూ గాలించినా ఒక్క తప్పు కూడా పట్టుకోలేక పోయారన్నారు. వెబ్సైట్లు డౌన్ చేయడం, మార్పింగ్లు చేయడం వైసీపీకి అలవాటైన విద్యని, వారివన్నీ ‘ఫేక్ బతుకులు’ అని మండిపడ్డారు.
బొత్స సత్యనారాయణ: శాసనమండలిలో కల్తీ నెయ్యి వ్యవహారాన్ని సమర్థించడం ద్వారా బొత్స దేవుడితో ఆటలాడుతున్నారని, ఇది ఏమాత్రం మంచిది కాదని హితవు పలికారు. “బియ్యం దొంగ పేర్ని నాని నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. రాత్రికి రాత్రి నేను వైష్ణవి డెయిరీ గేట్లకు రంగులు వేశానని ఆయన చెప్పడం ఆయన అజ్ఞానానికి నిదర్శనం” అని విమర్శించారు.

గత ఐదేళ్లలో అప్పటి సీఎం జగన్ తన సొంత మీడియా సంస్థలకు రూ. 307 కోట్ల విలువైన ప్రకటనలు ఇచ్చుకున్నారని, భారతీ సిమెంట్స్ ద్వారా 3 లక్షల టన్నుల సిమెంట్‌ను మాయం చేశారని ధూళిపాళ్ల ఆరోపించారు.
తనపై పెట్టిన 22 తప్పుడు కేసులను ప్రభుత్వం పరిశీలించి, వెంటనే ఎత్తివేయాలని కోరారు. సంగం డెయిరీ గుంటూరు రైతులదని, శ్రీజ డెయిరీ చిత్తూరు మహిళలదని ఆయన స్పష్టం చేశారు.
దక్షిణ భారతదేశంలో అమూల్ తర్వాత అత్యంత నాణ్యమైన ఉత్పత్తులు అందించేది తమ సంగం డెయిరీయేనని, ఈ విషయంలో ఎవరితోనైనా చర్చకు సిద్ధమని ధూళిపాళ్ల నరేంద్ర సవాల్ విసిరారు.

