
డైలీ మిర్రర్ డాట్ న్యూస్, హైదరాబాద్, అక్టోబర్ 11, 2025: రాజేంద్ర నగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU) క్యాంపస్‌లో ఉన్న బొటానికల్ గార్డెన్ మళ్లీ తన వైభవాన్ని సంతరించుకుంటోంది.
సుమారు 46 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ గార్డెన్ , గత 15 నుంచి 20 సంవత్సరాలుగా పూర్తి నిర్లక్ష్యానికి గురై , నిరుపయోగంగా మారింది. దీనిని తిరిగి పునరుద్ధరించేందుకు వర్సిటీ యాజమాన్యం గట్టి ప్రయత్నాలు చేస్తోంది.
సినిమా షూటింగ్‌లకు నిలయం: దాదాపు 50 సంవత్సరాల క్రితం స్థాపించిన ఈ గార్డెన్ , గతంలో ఎన్నో ప్రముఖ తెలుగు చలనచిత్రాల షూటింగ్‌లకు వేదికగా ఉండేది.దిగ్గజాల అడుగులు: ప్రముఖ నటులు కమల్ హాసన్, సావిత్రి, వాణిశ్రీ, విజయశాంతి వంటి దిగ్గజాలు ఇక్కడ చిత్రీకరణల్లో పాల్గొన్నారు.

పరిశోధనా వేదిక.. అంతేకాక, పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు, శాస్త్రవేత్తలకు ఇది పరిశోధనలు చేయడానికి నిలయంగా ఉండేది.
ముఖ్యమంత్రి చేతుల మీదుగా పునరుద్ధరణ ప్రారంభం..!
ఈ గార్డెన్ చారిత్రక ప్రాధాన్యతను గుర్తించిన ప్రస్తుత విశ్వవిద్యాలయ యాజమాన్యం , గత సంవత్సర కాలంగా పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టింది.
వనమహోత్సవంలో భాగంగా, సెప్టెంబర్ 7, 2025న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బొటానికల్ గార్డెన్ నుంచే వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మొక్కల పెంపకం: అదే రోజు HMDA సహకారంతో సుమారు 3 ఎకరాలలో 1500 వివిధ రకాల అటవీ జాతి మొక్కలను నాటారు.
కార్పొరేట్ సహకారంతో 10 వేల ఔషధ మొక్కల వనం..
విశ్వవిద్యాలయం , ప్రముఖ స్వచ్ఛంద సంస్థ నిర్మాణ్‌తో పాటు వివిధ కార్పొరేట్ సంస్థల సీఎస్‌ఆర్ (CSR) గ్రాంట్ల సహకారంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టింది.
10 ఎకరాల విస్తీర్ణం: ఈరోజు (అక్టోబర్ 11, 2025) బొటానికల్ గార్డెన్‌లో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో , ప్రముఖ కార్పొరేట్ కంపెనీ ఆర్సీజీఎం సహకారంతో , నిర్మాణ్ సంస్థ , విశ్వవిద్యాలయం కలిసి 10,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాయి. వివిధ ఔషధ మొక్కలతో ఔషధ వనం ఏర్పాటు చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉపకులపతితో పాటు రిజిస్ట్రార్, ఉన్నతాధికారులు, అగ్రోఫారెస్ట్రీ విభాగాధిపతి, ఆర్సీజీఎం ప్రతినిధులు మణిదీప, సుజిత, నిర్మాణ్ సంస్థ ప్రతినిధులు మయూర్, తిరుపతి పాల్గొన్నారు.
వర్సిటీ విద్యార్థులు, సిబ్బంది, ఆర్సీజీఎం వాలంటీర్లు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటారు. త్వరలోనే ఈ బొటానికల్ గార్డెన్ తిరిగి సందర్శకులకు, విద్యార్థులకు అందుబాటులోకి రానుంది.