డైలీ మిర్రర్ డాట్ న్యూస్,మంగళగిరి, ఏప్రిల్ 11,2026: వెనుకబడిన తరగతులు ఐక్యంగా పోరాడినప్పుడే హక్కుల సాధన సాధ్యమవుతుందని భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. బీసీ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ఆయన చేపట్టిన ‘ధర్మ దీక్ష’ శనివారం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రారంభమైంది. బీసీల ఐదు ప్రధాన డిమాండ్ల సాధన కోసం ఆయన ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.
ఈ కార్యక్రమానికి బీపీ మండల్ మనవడు డాక్టరు సూరజ్ మండల్, మహాత్మా జ్యోతిబా పూలే మునిమనవరాలు డాక్టరు ఎస్. పూలే ప్రత్యేక అతిథులుగా హాజరై రామచంద్ర యాదవ్‌కు సంఘీభావం ప్రకటించారు.
ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం
ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ.. గతంలో నిర్వహించిన ‘బీసీ సింహగర్జన’ సభలో తాము ప్రభుత్వం ముందు ఉంచిన ఐదు కీలక డిమాండ్లపై ఎలాంటి స్పందన రాకపోవడంతోనే ఈ దీక్షకు పూనుకున్నట్లు స్పష్టం చేశారు. అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం, వారి న్యాయమైన వాటా కోసం ప్రాణాలకైనా సిద్ధమని ఆయన ప్రకటించారు.
అండగా నిలుస్తాం: సూరజ్ మండల్
ఓబీసీ రిజర్వేషన్ల కోసం కృషి చేసిన బీపీ మండల్ వారసుడు డాక్టరు సూరజ్ మండల్ మాట్లాడుతూ.. బీసీల హక్కుల కోసం రామచంద్ర యాదవ్ చేస్తున్న పోరాటం అభినందనీయమని కొనియాడారు. రాజ్యాధికారం సిద్ధించినప్పుడే బీసీలకు సమన్యాయం జరుగుతుందని, ఈ పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు.

సమసమాజ స్థాపనే లక్ష్యం: డాక్టరు ఎస్. పూలే
జ్యోతిబా పూలే ఆశయాలకు అనుగుణంగా అట్టడుగు వర్గాలకు జనాభా ప్రాతిపదికన సమాన హక్కులు కల్పించాల్సిన అవసరం ఉందని డాక్టరు ఎస్. పూలే పేర్కొన్నారు. హక్కుల సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్న రామచంద్ర యాదవ్‌కు అండగా ఉంటామని, ప్రభుత్వం తక్షణమే ఈ డిమాండ్లను ఆమోదించాలని ఆమె డిమాండ్ చేశారు. దీక్షా ప్రదేశానికి చేరుకున్న పలు బీసీ సంఘాల నాయకులు రామచంద్ర యాదవ్‌కు సంఘీభావం తెలిపారు.
ప్రధాన డిమాండ్లు ఇవే..
బీసీ రక్షణ చట్టం: బీసీలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలి.
భూ కేటాయింపు: రాజధాని ప్రాంతంలో బీసీ భవనాలు, విద్యా సంస్థల కోసం 1,000 ఎకరాల భూమిని కేటాయించాలి.
కులగణన: రాష్ట్రవ్యాప్తంగా శాస్త్రీయంగా సమగ్ర కులగణన చేపట్టాలి.
నిధుల విడుదల: బీసీ కార్పొరేషన్లకు సరిపడా నిధులు కేటాయించి, వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలి.
44% రిజర్వేషన్లు: విద్య, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థలు, చట్టసభల్లో బీసీలకు 44 శాతం రిజర్వేషన్లు కల్పించాలి.

