
డైలీ మిర్రర్ డాట్ న్యూస్, తిరుమలగిరి, జూలై 19, 2025 : పల్లవి మోడల్ స్కూల్, తిరుమలగిరి బ్రాంచ్ ఈరోజు విద్య, పర్యావరణం, సామాజిక బాధ్యతలను ప్రతిబింబించే మూడు ముఖ్యమైన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించింది. విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకారోత్సవం, వన మహోత్సవం,మొదటి వార్షికోత్సవం (ఫౌండేషన్ డే) ఒకే రోజు నిర్వహించడం విశేషం.
విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకారోత్సవ వేడుక..
2025-26 విద్యా సంవత్సరానికి కొత్తగా ఎన్నికైన విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకారోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ వేడుకలో విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు మరియు ప్రత్యేక అతిథులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
తిరుమలగిరి బ్రాంచ్, పల్లవి మోడల్ స్కూల్ డైరెక్టర్ డా. ఎస్. కార్తీక్, ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి సాగర్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా లెఫ్టినెంట్ కల్నల్ లక్ష్మణ్ గణేష్ (ఇన్ఫంట్రీ ఆఫీసర్) తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో అదనపు పోలీస్ సూపరింటెండెంట్ పి. కృష్ణమూర్తి ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు చెందిన సీఐ శ్రీనివాస్ రావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విద్యార్థులు ప్రదర్శించిన ఉత్సాహభరితమైన స్వాగత నృత్యం, సాంస్కృతిక నైపుణ్యాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. కొత్తగా ఎన్నికైన విద్యార్థి నాయకులకు బ్యాడ్జీలు అందజేసి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.

హెడ్ గర్ల్, హెడ్ బాయ్ తమ స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలతో తోటి విద్యార్థులు తమపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
విచ్చేసిన అతిథులు మాట్లాడుతూ, నాయకత్వం అనేది బాధ్యతతో కూడుకున్నదని, అది విద్యార్థి దశ నుండే అలవర్చుకోవలసిన అవసరం ఉందని ఉద్బోధించారు. నాయకులు ఎప్పుడూ త్రికరణ శుద్ధితో పని చేస్తారని విద్యార్థులకు తెలియజేశారు.
క్రమశిక్షణను అమలు పర్చడంలో విద్యార్థి నాయకులు ఎంతో అవసరమని, విద్యార్థి దశలో శిక్షణ పొందిన వీరంతా మంచి నాయకులుగా ఎదిగి విద్య, క్రీడలు, రాజకీయ, పారిశ్రామిక రంగాల్లో ప్రవేశించి దేశ ప్రగతికి తోడ్పడాలని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు.
వన మహోత్సవం..
వాతావరణ పరిరక్షణను ప్రోత్సహిస్తూ, పాఠశాల ఆవరణలో డా. ఎస్. కార్తీక్, విజయలక్ష్మి సాగర్, అతిథులు మొక్కలు నాటారు. పాఠశాల తరఫున విద్యార్థులు కూడా “పచ్చదనం మన భవితవ్యానికి నిడివి” అనే సందేశంతో వనసంరక్షణ పట్ల తమ చైతన్యాన్ని వ్యక్తపరిచారు.

పాఠశాల వ్యవస్థాపక దినోత్సవం: మూడేళ్ల ప్రస్థానం
పాఠశాల స్థాపించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన మొదటి ఫౌండేషన్ డే వేడుకలో గత ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ, స్మృతిపథంలోకి తీసుకెళ్లే చిత్రరేఖలు ఆవిష్కరించబడ్డాయి.
ఈ సందర్భంగా తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో అదనపు పోలీస్ సూపరింటెండెంట్ పి. కృష్ణమూర్తి ప్రధాన అతిథిగా హాజరై విద్యార్థులతో “Say No to Drugs” అనే నినాదంతో ప్రతిజ్ఞ చేయించారు.
మత్తు పదార్థాల నుంచి విద్యార్థులను దూరంగా ఉంచేలా చైతన్యవంతమైన సందేశాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్ రావు కూడా పాల్గొన్నారు.

ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి సాగర్ మాట్లాడుతూ, “ఈ మూడు కార్యక్రమాలనూ విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే దశలుగా భావించాలి. నాయకత్వం, ప్రకృతి పరిరక్షణ, పాఠశాల పునాది విలువలు ఇవన్నీ సమగ్ర విద్యను ముందుకు నడిపిస్తాయి” అన్నారు.
ఈ సందర్భంగా పాల్గొన్న తల్లిదండ్రులు, అతిథులు, ఉపాధ్యాయులు ఈ మూడింటినీ సమ్మిళితంగా నిర్వహించిన పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమాలు విద్యార్థుల జీవితాల్లో స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని ప్రశంసించారు.
విచ్చేసిన అతిధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, యాజమాన్యం అందరి సమక్షంలో అద్భుతమైన ఈ మూడు కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి.