డైలీ మిర్రర్ డాట్ న్యూస్,డిసెంబర్ 19,2024: భారతీయ సినీ ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకుడిగా ఉపేంద్రకు విశేషమైన గుర్తింపు ఉంది. 90లలో తన సినిమాలతో అపారమైన హంగామా చేసిన ఉపేంద్ర, “కన్యాదానం”, “రా”, “ఏ”, “ఉపేంద్ర”, “రక్త కన్నీరు”, “న్యూస్” వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.

విభిన్నమైన కథాంశాలను ఎంచుకుని సినిమాలు చేయడం ఆయనకు ఆయనే సాటి. అప్పట్లో ఉపేంద్ర సినిమాలు అంటే కర్నాటకలో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ లో పండుగ వాతావరణం కనిపించేది.

అయితే, గత కొన్ని సంవత్సరాలుగా తన స్వీయ దర్శకత్వాన్ని దూరం పెట్టి, కేవలం హీరోగా మాత్రమే సినిమాలు చేస్తున్న ఉపేంద్ర, గత ఏడాది “కబ్జా” సినిమాతో మళ్లీ ఆడియెన్స్‌ను అలరించారు. ఉపేంద్ర మరోసారి స్వీయదర్శకత్వంలో “యూఐ” అనే సినిమా తీశారు. ఈ సినిమా డిసెంబరు 20న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో విడుదల అవుతోంది.

కొద్ది రోజుల క్రితం, ఈ సినిమా తెలుగు ప్రమోషన్లలో భాగంగా, టాలీవుడ్ ఆడియెన్స్‌తో ముచ్చటించిన ఉపేంద్ర, “యూఐ”తో సరికొత్త కాన్సెప్ట్‌ ద్వారా అందరినీ అలరించనున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో క్లైమాక్స్ కూడా ప్రేక్షకులు ఊహించిన దానికంటే చాలా భిన్నంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

కన్నడ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో, “యూఐ” సినిమా కూడా భారీ కలెక్షన్లను సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. “యూఐ” డబ్బింగ్ మూవీ అయినప్పటికీ, టాలీవుడ్‌లో ఉపేంద్రకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో, ఈ సినిమాకు మంచి బుకింగ్స్ వస్తున్నాయి.

ఈ సినిమాతో మరోసారి “వింటేజ్ ఉపేంద్ర” దర్శకత్వాన్ని చూడాలని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. “యూఐ” సినిమా ఎంతటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి మరి.