డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 2,2025: 23 బిలియన్ డాలర్ల విలువైన జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌లో భాగమైన జేఎస్‌డబ్ల్యూ డిఫెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రక్షణ రంగంలో కీలక అడుగు వేసింది. హైదరాబాద్‌లోని మహేశ్వరం ఈఎంసీలో తదుపరి తరం అన్‌మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ (UAS) తయారీ ప్లాంటు నిర్మాణాన్ని నేడు ప్రారంభించింది.
మిలిటరీ డ్రోన్ల తయారీ కోసం అమెరికాకు చెందిన ప్రముఖ డిఫెన్స్ టెక్నాలజీ దిగ్గజం షీల్డ్ ఏఐ (Shield AI) తో జేఎస్‌డబ్ల్యూ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద షీల్డ్ ఏఐకి చెందిన గ్రూప్ 3 యూఏఎస్-వీ-బ్యాట్ (V-BAT) డ్రోన్ల తయారీకి సంబంధించిన టెక్నాలజీ బదలాయింపు (ToT) లైసెన్సింగ్ జరగనుంది.
రూ. 750 కోట్లకు పైగా పెట్టుబడి
ఈ భాగస్వామ్యంలో భాగంగా, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఈ అధునాతన ప్లాంట్‌పై సుమారు 90 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు ₹750 కోట్ల) పెట్టుబడి పెట్టనుంది. ఈ నిధులు తయారీ కేంద్రం ఏర్పాటు, గ్లోబల్ కాంప్లయెన్స్ ప్రోగ్రాం, టెక్నాలజీ లైసెన్సింగ్ ,మానవ వనరుల శిక్షణ కోసం వినియోగించబడతాయి.

ఈ ప్లాంట్ ద్వారా భారత్‌లో V-BATల తయారీ, అసెంబ్లింగ్, టెస్టింగ్‌తో పాటు స్థానికంగా సరఫరా వ్యవస్థ (Supply Chain) ఏర్పాటు కానుంది.
భారత సాయుధ బలగాల అవసరాలను తీర్చడంతో పాటు, ఈ కేంద్రం గ్లోబల్ ప్రొడక్షన్ హబ్‌గా పనిచేయనుంది.
ఈ ప్లాంటులో 2026 ఆఖరు త్రైమాసికం (Q4) నుంచి V-BATల ఉత్పత్తి ప్రారంభమవుతుందని అంచనా.
స్వయం సమృద్ధికి మైలురాయి
ప్లాంటు నిర్మాణానికి తెలంగాణ ఐటీ, ఈ&సీ, పరిశ్రమలు & వాణిజ్య శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌నకు చెందిన శ్రీ పార్థ్ జిందాల్ శంకుస్థాపన చేశారు.
శ్రీ పార్థ్ జిందాల్ మాట్లాడుతూ, “తదుపరి తరం డిఫెన్స్ టెక్నాలజీలలో స్వయం సమృద్ధి సాధించే దిశగా భారతదేశ ప్రయాణంలో ఇదొక సాహసోపేతమైన కొత్త అధ్యాయం. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా V-BATలను పెద్ద ఎత్తున తయారు చేయడంతో పాటు, ఆపరేటర్ శిక్షణ,సుస్థిర ఆవిష్కరణల వరకు పూర్తి స్థాయి యూఏఎస్ వ్యవస్థకు ఈ ప్లాంటు పునాది వేస్తుంది. ఇది భారత్‌కు అత్యంత ప్రధానమైన టెక్నాలజీ బదిలీల్లో ఒకటిగా నిలుస్తుంది” అని పేర్కొన్నారు.

V-BAT ప్రత్యేకతలు
V-BAT అనేది ఫిక్సిడ్ వింగ్, వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ (VTOL) సామర్థ్యాలు కలిగి, సుదీర్ఘ సమయం పనిచేయగలిగే నిఘా, పర్యవేక్షణ (ISR) ప్లాట్‌ఫామ్. అమెరికా సాయుధ బలగాలతో సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు దీనిని వినియోగిస్తున్నాయి. ఈ డ్రోన్ పేటెంట్ పొందిన డక్టెడ్ డిజైన్, లాజిస్టిక్స్‌లో తక్కువ ఆనవాళ్లను కలిగి ఉండి, వేగంగా వినియోగించడానికి అనువుగా ఉంటుంది.
ఈ ప్రాజెక్టు ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి అనుగుణంగా ఉండి, తెలంగాణ పారిశ్రామిక వ్యవస్థను, జాతీయ భద్రతను పటిష్టం చేయనుంది.

