డైలీమిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్, అక్టోబర్ 19, 2025: పండ్ల ఆధారిత, రెడీ-టు-డ్రింక్ పానీయాలలో ఇకపై ‘ఓఆర్ఎస్’ (ORS – Oral Rehydration Solution) పదాన్ని వాడటానికి వీల్లేదు!

బ్రాండ్‌ పేర్లతో సహా ఎక్కడా ఈ పదాన్ని ఉపయోగించకూడదని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కఠిన ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ ఆదేశాలు అమలు కాకుండా, ప్రముఖ హైడ్రేషన్ డ్రింక్ సంస్థ జెఎన్‌టిఎల్ (JNTL) ఢిల్లీ హైకోర్టు నుంచి స్టే ఉత్తర్వులు సాధించింది.

FSSAI ఆదేశాలు..

అక్టోబర్ 14, 15 తేదీల్లో FSSAI ఈ మేరకు అధికారిక కమ్యూనికేషన్ జారీ చేసింది.

ట్రేడ్‌మార్క్‌లు లేదా ప్యాక్‌లపై “ఓఆర్ఎస్” పదాన్ని చేర్చడం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం-2006 నిబంధనలకు విరుద్ధమని తేల్చి చెప్పింది.

సాధారణంగా విరేచనాల (డయేరియా) చికిత్సకు ఉపయోగించేది ‘ఓఆర్ఎస్’గా సుపరిచితం. ఈ మెడిసిన్ గురించి, మార్కెట్‌లో ఉన్న సాధారణ ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ గురించి వినియోగదారుల్లో ఎటువంటి గందరగోళం తలెత్తకుండా ఉండటానికే FSSAI ఈ చర్య తీసుకుంది.

నిషేధం కాదు… తాత్కాలిక ఊరట!

FSSAI ఆదేశాల తర్వాత, మార్కెట్‌లోని ఎలక్ట్రోలైట్ పానీయాలు ‘నిషేధించబడ్డాయి’ అనే తప్పుడు ప్రచారం జరిగింది. దీనిపై FSSAI స్పందిస్తూ, తమ ఆదేశాలు కేవలం లేబులింగ్ మార్పులకు సంబంధించినవే తప్ప, ఉత్పత్తులను పూర్తిగా నిషేధించలేదని స్పష్టం చేసింది.

మరోవైపు, ప్రముఖ హైడ్రేషన్ డ్రింక్ బ్రాండ్‌ ఓఆర్ఎస్ఎల్ (ORSL) ను మార్కెటింగ్ చేస్తున్న కెన్వూ (Kenvue)/జెఎన్‌టిఎల్ సంస్థ, FSSAI ఆదేశాలపై అక్టోబర్ 17న ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు, FSSAI ఆదేశాల అమలుపై స్టే మంజూరు చేసింది.

ఢిల్లీ హైకోర్టు స్టే కారణంగా, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రిటైలర్లు ఈ ఉత్పత్తులను యథావిధిగా విక్రయించవచ్చు,పంపిణీ చేయవచ్చు.

వినియోగదారులకు స్పష్టత ఇవ్వడం,ఆహార ఉత్పత్తుల లేబులింగ్‌లో పారదర్శకతను పెంచడం కోసం FSSAI ఈ నియంత్రణ చర్యలు కొనసాగిస్తోంది.