
డైలీ మిర్రర్ డాట్ న్యూస్, హైదరాబాద్, మార్చి 25,2025: ఖాజాగూడాలోని కొత్తకుంట (నానక్ రామ్ కుంట) చెరువులో ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో మంగళవారం హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పరిశీలించారు.
ఈ అంశంపై స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కూడా హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. పరిస్థితిని స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించిన కమిషనర్, చెరువులో మట్టి పోసిన విషయాన్ని గమనించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వంశీరామ్ బిల్డర్స్ ప్రతినిధులతో మాట్లాడిన కమిషనర్, చెరువులో వేసిన మట్టిని మూడు లేదా నాలుగు రోజుల్లో పూర్తిగా తొలగించాలని స్పష్టం చేశారు. నిర్ధేశిత గడువులో తొలగించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే, చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిని నిర్ధారించేందుకు జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించాలని సూచించారు.
ఈ సందర్భంగా వంశీరామ్ బిల్డర్స్ ప్రతినిధులు, రెండు మూడు రోజుల్లో చెరువులో పోసిన మట్టిని పూర్తిగా తొలగిస్తామని హామీ ఇచ్చారు.