డైలీ మిర్రర్ డాట్ న్యూస్,కోయంబత్తూరు, నవంబర్ 17,2024: ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్‌ (ఐఆర్‌ఎఫ్‌) లో భాగంగా జరిగిన ఫార్ములా 4 ఇండియన్ చాంపియన్‌షిప్ లో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ డ్రైవర్‌‌ అకిల్ అలీభాయ్ చాంపియన్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లో ఆరు రౌండ్లలో విజేతగా నిలిచిన అకిల్ ఆదివారం ఇక్కడి కరీ మోటార్ స్పీడ్‌వే పై జరిగిన ఫైనల్‌ రౌండ్‌ చివరి రెండు రేసుల్లో దక్షిణాఫ్రికాకు చెందిన అలీభాయ్‌ రెండు, మూడో స్థానాల్లో నిలిచినప్పటికీ ట్రోఫీ అవసరమైన పాయింట్లు సొంతం చేసుకున్నాడు.

దాంతో ఈ సీజన్‌లో చాంపియన్‌షిప్‌ గెలుచుకున్నాడు. ఆఖరి రోజు జరిగిన చివరి రెండు రేసుల్లో భారత డ్రైవర్‌‌, శ్రాచి రార్ రాయల్ బెంగాల్ టైగర్స్ కు చెందిన రుహాన్ అల్వా పోడియం ఫినిష్‌ చేసి అలీభాయ్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. రెండో రేసులో రుహాన్‌ 26 నిమిషాల 55.114 సెకన్లలో అగ్రస్థానంతో ముగించాడు. అకిల్ అలీభాయ్ 27 నిమిషాల14.880) సెకన్లతో రెండో స్థానం సాధించగా, డివి నందన్ (భారత్, బెంగళూరు స్పీడ్‌స్టర్స్, 27:24.987సె) మూడో స్థానం దక్కించుకున్నాడు.

మూడో రేసులోనూ రుహాన్ అల్వా ( 27:00.884 సె) మొదటి స్థానం దక్కించుకోగా.. అకిల్ అలీభాయ్ (27:16.425 సె) మూడో స్థానం సాధించాడు. అయినా సీజన్ చాంపియన్‌షిప్‌లో రుహాన్‌ కంటే 29 పాయింట్ల ఆధిక్యంతో విజేతగా నిలిచాడు. “నేను ఈ సీజన్‌ను విజయంతో ముగించాలనుకున్నాను. కానీ అలా జరగలేదు. అయినా ఈ సీజన్‌ నాకు మంచి ఫలితాన్ని ఇచ్చింది. చాంపియన్‌షిప్‌ గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ విజయం నన్ను ఎక్కడికి తీసుకువెళుతుందో చూద్దాం ” అని అకిల్ అలీభాయ్ పేర్కొన్నాడు.

ఐఆర్‌‌ఎల్‌ విజేత గోవా ఏసెస్ జేఏ రేసింగ్

ఇండియన్ రేసింగ్‌ లీగ్‌ (ఐఆర్‌‌ఎల్‌)లో గోవా ఏసెస్ జేఏ రేసింగ్‌ జట్టు చాంపియన్‌గా నిలిచింది. చివరి రేసులో ఆ జట్టు డ్రైవర్లు రౌల్ హైమాన్, గాబ్రియేలా జిల్కోవా 1,-2వ స్థానాల్లో నిలవడమే కాకుండా గోవా చాపియన్‌షిప్‌ను కైవసం చేసుకోవడంలో సహాయం చేశారు. యూకేకి చెందిన రౌల్ హైమాన్ (26:39.020సె) అగ్రస్థానంతో పోడియం ముగించాడు. చెక్ రిపబ్లిక్ కు చెందిన గాబ్రియేలా జిల్కోవా (27:07.684సె) రెండో స్థానం సాధించగా.. భారత్‌కు చెందిన మహ్మద్ ర్యాన్ ( చెన్నై టర్బో రైడర్స్) (27:29.813సె) మూడో స్థానంలో నిలిచాడు.

“చివరి రేసును 1,2వ స్థానాలతో ముగించినందుకు చాలా సంతోషంగా ఉన్నాం. మా కోసం రేసుల్లో గెలిచిన కార్లను మాకు అందించినందుకు మేము బృందానికి కృతజ్ఞతలు. వారి కృషి వల్లే మేము చాంపియన్‌షిప్‌ను గెలుచుకోగలిగాం’ అని హైమన్ పేర్కొన్నాడు.