డైలీమిర్రర్ న్యూస్, జనవరి 26, 2025: జపాన్‌కు చెందిన ఇసుజు మోటార్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన ఇసుజు మోటార్స్ ఇండియా, తెలంగాణలో తన సేవా వ్యాపారాన్ని విస్తరించింది. ఖమ్మంలో కొత్తగా ప్రారంభించిన అధీకృత సేవా కేంద్రం (ఏఎస్‌సి) ద్వారా, ఇసుజు వినియోగదారులకు మెరుగైన సేవలను అందించేందుకు మరో ముందడుగు వేసింది.

తన వినియోగదారులకు ఉత్తమ సేవలతో పాటు అద్భుతమైన అనుభవాన్ని అందించ డంపై దృష్టి పెట్టిన ఇసుజు మోటార్స్ ఇండియా, ఖమ్మంలో బియాండ్ ఆటోకేర్‌ను తన అధీకృత సేవా భాగస్వామిగా నియమించింది. ఇది తెలంగాణలో ఇసుజు మూడవ టచ్‌పాయింట్ కావడం విశేషం. ఖమ్మంలోని ఎస్‌వీ పవర్ ప్లాజాలో ఈ ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇక్కడ అత్యాధునిక పనిముట్లతో పాటు అసలైన విడిభాగాలు, ల్యూబ్స్, సుశిక్షితులైన సిబ్బంది ఉండటం వల్ల వినియోగదారులకు నిరంతరాయ సేవలు అందించవచ్చు.

ఇసుజు మోటార్స్ ఇండియా అధికారుల సమక్షంలో, బియాండ్ ఆటోకేర్ ఈ సదుపాయాన్ని ఆరంభించింది. ఈ సందర్భంగా ఇసుజు మోటార్స్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ టోరు కిషిమోటో మాట్లాడుతూ, “మా వినియోగదారుల ప్రయాణంలో నిరంతరాయమైన సేవలను అందించడమే కాకుండా, వారికి అర్థవంతమైన అనుబంధాన్ని నిర్మించడంలో మా నిబద్ధతను కొనసాగిస్తున్నాము. అసాధారణ వినియోగదారు సంతృప్తి మా సేవా విధానానికి ప్రాధాన్యం. మా విశ్వసనీయ భాగస్వాముల మద్దతుతో మరింత మెరుగైన యాజమాన్య అనుభవాన్ని అందించడంలో బియాండ్ ఆటోకేర్ మాకు తోడ్పడుతుంది” అని తెలిపారు.

బియాండ్ ఆటోకేర్ డీలర్ ప్రిన్సిపల్ కేతినేని నరసింహారావు మాట్లాడుతూ, “ఇసుజు మోటార్స్ ఇండియాతో భాగస్వామ్యం చేయడం గర్వకారణం. ఖమ్మం ప్రాంతంలో ఇసుజు వినియోగదారులకు అధిక ప్రమాణాలు కలిగిన సేవలను అందించడంలో మా ప్రాధాన్యత కొనసాగుతుంది” అని అన్నారు.

బియాండ్ ఆటోకేర్, ఇసుజు మోటార్స్ వినియోగదారులకు నాణ్యమైన సేవలతో పాటు వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించింది. ఈ సదుపాయాలు ఖమ్మం సహా పరిసర ప్రాంతాల వినియోగదారుల అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తాయని సంస్థ తెలిపింది.