
డైలీమిర్రర్ డాట్ న్యూస్,23 సెప్టెంబర్, 2024:నెట్వర్క్ ఎక్విప్మెంట్ సరఫరా కోసం ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా (VIL) మూడు అంతర్జాతీయ భాగస్వాము లతో 3.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 30,000 కోట్లు) విలువైన భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

ఈ కాంట్రాక్టు కింద వొడాఫోన్ ఐడియా నోకియా, ఎరిక్సన్, సామ్సంగ్ సంస్థలతో కలిసి పని చేయనుంది. ఈ ఒప్పందం ద్వారా 6.6 బిలియన్ డాలర్లతో (సుమారు రూ. 55,000 కోట్లు) అమలు చేయనున్న మూడు సంవత్సరాల ప్రణాళికకు ఇది మొదటి అడుగు కానుంది.
ఈ ఒప్పందం కింద 4జీ కవరేజీని 103 కోట్ల నుంచి 120 కోట్ల మందికి విస్తరించడంతో పాటు,ప్రధాన మార్కెట్లలో 5జీ సేవలను ప్రారంభించేందుకు ఈ పెట్టుబడివ్యయా లు తోడ్పడతాయి. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు కొత్త టెక్నాలజీ లతో సర్వీసులను వేగంగా మెరుగుపరచడానికి ఈ కాంట్రాక్టులు ఉపయోగపడ తాయి.

ఇటీవల రూ. 24,000 కోట్ల ఈక్విటీ సమీకరణతో పాటు, జూన్ 2024లో రూ. 3,500 కోట్ల విలువైన అదనపు స్పెక్ట్రమ్ కొనుగోలుతో వొడాఫోన్ ఐడియా ఈ భారీ ప్రణాళికలను అమలు చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. 2024 సెప్టెంబర్ చివరికి సామర్థ్యాలను 15 శాతం పెంచుకోవడంతోపాటు 1.6 కోట్ల మంది కవరేజీని విస్తరించేందుకు వొడాఫోన్ ఐడియా ప్రణాళికలు అమలు చేస్తోంది.

వీఐఎల్ సీఈవో అక్షయ ముంద్రా మాట్లాడుతూ, “మా కస్టమర్లకు అత్యుత్తమ సేవలు అందించేందుకు మేము వృద్ధి సాధించడానికి కట్టుబడి ఉన్నాము. నోకియా, ఎరిక్సన్తో పాటు, సామ్‌సంగ్‌తో మొదటి సారి భాగస్వామ్యం చేయడం మా కోసం గర్వకారణం” అని తెలిపారు.
వొడాఫోన్ ఐడియా ప్రస్తుత, కొత్త రుణదాతలతో రూ. 25,000 కోట్ల ఫండ్ ఆధారిత,రూ. 10,000 కోట్ల నాన్-ఫండ్ ఆధారిత సదుపాయాల కోసం చర్చలు జరుపుతుంది.