డైలీ మిర్రర్ డాట్ న్యూస్,ముంబై,9 నవంబర్ 2024: కోల్‌కతాకు చెందిన హల్దీరామ్‌ భుజియావాలా లిమిటెడ్ తాజా విడత ప్రైవేట్ ప్లేస్‌మెంట్‌ విజయవంతంగా పూర్తయినట్లు వెల్లడించింది.  తమ కంపెనీలో మైనారిటీ వాటా కోసం పాంటోమత్‌కి చెందిన భారత్ వేల్యూ ఫండ్ (BVF) రూ. 235 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు తెలిపింది. “ప్రభూజీ” బ్రాండ్ కింద హల్దీరామ్‌ భుజియావాలా లిమిటెడ్ తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది.

భారతదేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న రంగాల్లో ఒకటైన స్నాక్స్ మార్కెట్ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 42,600 కోట్లుగా ఉన్నట్లు అంచనా. ఇది వార్షికంగా 11 శాతం వృద్ధితో  2032 ఆర్థిక సంవత్సరం నాటికి దాదాపు రూ. 95,500 కోట్ల స్థాయికి చేరుతుందనే అంచనాలు ఉన్నాయి.

గణనీయంగా మార్కెట్ వాటా ఉన్న సంఘటిత సంస్థలు ఈ వృద్ధి సాధనలో కీలక పాత్ర పోషించనున్నాయి. ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్‌తో పాటు నాణ్యత, సౌలభ్యం,భద్రతా ప్రమాణాలపై నిరంతరం మరింతగా దృష్టి పెడుతున్న సంస్థలు తదుపరి కార్యకలాపాలను విస్తరించనున్నాయి.

స్నాక్స్ అండ్ సేవరీ పరిశ్రమలో హల్దీరామ్‌ భుజియావాలా లిమిటెడ్‌కు ఆరు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. “ప్రభూజీ” బ్రాండ్ పేరిట కంపెనీ తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది. 100+ ఎస్‌కేయూలతో విస్తృతమైన ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో ఉంది. కంపెనీ బ్రాండ్‌కు పటిష్టమైన గుర్తింపు ఉంది.

ముఖ్యంగా తూర్పు,ఈశాన్య రాష్ట్రాల మర్కెట్లతో పాటు పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో క్విక్ సర్వీస్ రెస్టారెంట్లను కూడా నిర్వహిస్తోంది. కంపెనీ, నవతరపు మార్కెటింగ్ వ్యూహం దన్నుతో ‘ప్రభూజీ’ మరింత ఆధునిక బ్రాండ్‌గా ఎదిగింది. షారుఖ్ ఖాన్,రష్మిక మందన వంటి ప్రముఖ బాలీవుడ్ నటులు బ్రాండ్‌కి ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు.

హల్దీరామ్ భుజియావాలా లిమిటెడ్ ఇటు రిటైల్ వ్యాపారంతో పాటు అటు పంపిణీ వ్యాపారంలోనూ పటిష్టంగా కార్యకలాపాలు సాగిస్తోంది. కంపెనీకి దాదాపు 2,000 పంపిణీదారుల పంపిణీ నెట్‌వర్క్ ఉంది. దేశవ్యాప్తంగా 2,00,000 మంది పైచిలుకు రిటైలర్లకు సేవలు అందిస్తోంది. కంపెనీ 19 రిటైల్ అవుట్‌లెట్లు, 60 ఫ్రాంఛైజీ స్టోర్లను నిర్వహించడం ద్వారా నేరుగా కస్టమర్లకు కూడా విక్రయిస్తోంది. 

ప్రస్తుతం, కంపెనీ పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాలు మొదలైన ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తూర్పు ఈశాన్య భారత మార్కెట్ల వెలుపల కూడా తన తయారీ కార్యకలాపాలు,మార్కెట్‌ను పెంచుకోవడానికి కంపెనీ ఈ నిధులను ఉపయోగించుకుంటుంది. హల్దీరామ్ భుజియావాలా లిమిటెడ్ సంవత్సరానికి 6,035  మెట్రిక్ టన్నుల (MTPA) సామర్థ్యంతో మూడు తయారీ యూనిట్లను నిర్వహిస్తోంది.

“గత 60+ సంవత్సరాలుగా రుచికరమైన స్నాక్స్, స్వీట్లను అందించడం ద్వారా విశ్వసనీయమైన కస్టమర్లను గణనీయంగా పెంచుకున్నాం. భారతదేశ ఆహారపు అలవాట్లు ,అభిరుచుల్లో విప్లవాత్మక మార్పులు తెస్తూ మా కంపెనీ ఒక ట్రెండ్‌సెటర్‌గా నిలుస్తోంది. పరిశ్రమలో మాకున్న అనుభవంతో పాటు బీవీఎఫ్ తోడ్పాటుతో మా వాటాదారులకు మరింత విలువ చేకూర్చేందుకు, అధిక వృద్ధిని సాధించేందుకు మేము మరింతగా కృషి చేస్తాం.

దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలను పొందడానికి, వాటాదారులందరికీ సుసంపన్నమైన భవిష్యత్తును అందించడానికి ఈ భాగస్వామ్యం బలమైన పునాది వేస్తుంది “అని హల్దీరామ్‌ భుజియావాలా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మనీష్ అగర్వాల్ తెలిపారు.

“హల్దీరామ్‌ భుజియావాలా లిమిటెడ్‌తో జట్టు కట్టడం మాకు చాలా సంతోషకరమైన విషయం. 1958లో ప్రొప్రైటర్‌షిప్ సంస్థగా ఏర్పాటైనప్పటి నుంచి కంపెనీకి ఆరు దశాబ్దాల పైగా మార్కెట్‌లో అనుభవం ఉంది. వినియోగదారుల ధోరణులు, మార్కెట్ పోకడలపై లోతైన అవగాహన ఉంది.

కొత్త తరం ప్రధానంగా ఆధునిక బ్రాండ్ “ప్రభూజీ”పై మరింతగా దృష్టి పెడుతుండటం గమనార్హమైన అంశం. ఆహారం, ఎఫ్ఎంసీజీ, వినియోగ వస్తువుల రంగాలపై మేము చాలా ఆశావహంగా ఉన్నాము. రాబోయే సంవత్సరాల్లో గణనీయమైన వృద్ధిని సాధించేలా హల్దీరామ్ పటిష్టమైన స్థితిలో ఉంది” అని భారత్ వాల్యూ ఫండ్ సీఐవో Ms. మధు లునావత్ అన్నారు.

మిడ్-మార్కెట్ రంగంలో ప్రముఖ ఫండ్ హౌస్‌లలో ఒకటైన బీవీఎఫ్, దీర్ఘకాలిక విజయాన్ని సాధించేందుకు లాభదాయకమైన, వృద్ధి-దశ కంపెనీలలో పెట్టుబడులు పెట్టడంపై దృష్టి పెడుతుంది. హల్దీరామ్‌లో పెట్టిన పెట్టుబడి బీవీఎఫ్‌ మొత్తం పెట్టుబడుల్లో 6వది కాగా, గత 3 నెలల్లో కన్జూమర్ విభాగంలో 3వది. గత నెల తొలినాళ్లలో, బీవీఎఫ్ వ్యక్తిగత పరిశుభ్రత బ్రాండ్ ‘బమ్‌టమ్’ (మిలీనియం బేబీకేర్ లిమిటెడ్) కన్జూమర్ డ్యూరబుల్స్ కంపెనీ అనికేత్ మెటల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పెట్టుబడులు పెట్టింది.