డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్‌, ఏప్రిల్ 9,2025: డైమ్లర్ ఇండియా కమర్షియల్ వెహికిల్స్ (DICV) తమ డొమెస్టిక్ సేల్స్ & కస్టమర్ సర్వీస్ విభాగానికి నూతన ప్రెసిడెంట్ అండ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా రాజీవ్ చతుర్వేదిని నియమించింది.

డైమ్లర్ ట్రక్ ఏజీ యాజమాన్యంలో నడుస్తున్న ఈ సంస్థ ఏప్రిల్ 1, 2025 నుంచి ఈ నియామకాన్ని అమలులోకి తేనుందని ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న శ్రీరామ్ వెంకటేశ్వరణి రాజీవ్ స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్నారు.

రాజీవ్‌కి నిర్మాణ, భారీ యంత్ర సామగ్రి రంగాల్లో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. వ్యాపార వ్యూహాలు, మార్కెట్ విస్తరణ, విక్రయాలు, ఆపరేషన్ల పరంగా ఆయనకు ప్రావీణ్యం ఉంది. DICV దేశీయ మార్కెట్ వృద్ధి, ఆపరేషనల్ ఎఫిషియెన్సీపై దృష్టి పెట్టి, బ్రాండ్‌ను బలోపేతం చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించనున్నారని సంస్థ తెలిపింది.

ఈ సందర్భంగా DICV మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ సత్యకం ఆర్య మాట్లాడుతూ, ‘‘రాజీవ్‌ను మా బృందంలోకి ఆహ్వానించడం మాకు ఆనందంగా ఉంది. ఆయనకు ఉన్న అనుభవం, వ్యాపారపరమైన దృష్టి DICV దేశీయ వ్యాపార విస్తరణకు దోహదపడుతుంది’’ అని పేర్కొన్నారు.

రాజీవ్ గతంలో హ్యూండాయ్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఇండియా & SAARC)గా పనిచేశారు. మార్కెట్ విస్తరణ, లాభాల సాధనలో ఆయన కీలక పాత్ర పోషించారు. టాటా హిటాచీ కన్స్ట్రక్షన్ మిషినరీ సంస్థలోనూ నాయకత్వ బాధ్యతలు నిర్వహించారు.

‘‘DICVలో భాగంగా ఉండడం గర్వంగా ఉంది. వాణిజ్య వాహనాల విభాగంలో కొత్త ప్రామాణికాలు నెలకొల్పేందుకు మా బృందంతో కలిసి పనిచేస్తాను’’ అని రాజీవ్ చతుర్వేది పేర్కొన్నారు.