
డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్ జూన్ 28, 2025 :ప్రస్తుత ప్రేక్షకులు కథాబలం ఉన్న సినిమాలనే చూస్తున్నారు. ఓటీటీల రాకతో ఈ మార్పు మరింత స్పష్టంగా కనిపిస్తోంది.
సరిగ్గా ఇదే సమయంలో, ‘కంటెంట్ బేస్డ్ ఫిల్మ్’గా ప్రచారం పొంది, ‘కన్నప్ప’ వంటి భారీ సినిమాకు పోటీగా బరిలోకి దిగిన ‘చంద్రేశ్వర’ చిత్రం సినీ వర్గాల్లో చర్చకు దారితీసింది.
పురాతన ఆలయం, ఆర్కియాలజీ నేపథ్యం, శివుడితో ముడిపడిన కథ అంటూ మేకర్స్ చేసిన ప్రమోషన్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? బాక్సాఫీస్ వద్ద నిలబడే సత్తా దీనికి ఉందా? వివరాలు చూద్దాం.
కథ: మిస్టీరియస్ గ్రామం, దాగున్న నిధి రహస్యం
నందివర్మ పర్వతం కింద ఒక పురాతన గుడి, అందులో నిధి ఉన్నాయనే సమాచారంతో, ఆర్కియాలజీ విభాగానికి చెందిన ఎమ్.డి. చక్రవర్తి (నిళల్గళ్ రవి) ఒక టీమ్‌ను చంద్రగిరి గ్రామానికి పంపిస్తాడు. ప్రొఫెసర్ బోస్ (బోసే రవి) నేతృత్వంలోని ఆ బృందం గ్రామస్తుల తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. గతంలో జరిగిన కొన్ని దురదృష్టకర సంఘటనల వల్ల తమ ఊరికి వచ్చిన వారంతా మరణించారని గ్రామస్థులు వారిని అడ్డుకుంటారు. ఎలాగోలా వారిని ఒప్పించి, బోస్ టీమ్ తవ్వకాలు మొదలుపెడుతుంది.
కానీ, ఆ గ్రామంలో ఒక వింత ఆచారం ఉంది. చీకటి పడిన తర్వాత ఎవరూ బయట తిరగకూడదు. ఈ నియమాన్ని అతిక్రమించిన వారు దారుణంగా చనిపోతూ ఉంటారు. సరిగ్గా ఈ సమయంలో చంద్రగిరి గ్రామానికి సబ్ ఇన్స్పెక్టర్గా వచ్చిన గురు వర్మ (సురేశ్ రవి), ఈ హత్యల వెనుక ఉన్న అసలు కారణాన్ని తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు. ఈ దర్యాప్తులో భాగంగానే ఆర్కియాలజీ టీమ్‌లోని అఖిల (ఆశ వెంకటేష్)తో ప్రేమలో పడతాడు. గురు వర్మ తన ఇన్వెస్టిగేషన్లో ఎన్నో షాకింగ్ నిజాలను తెలుసుకుంటాడు. అసలు ఆ ఊరిలో జరుగుతున్న చావులకు కారణం ఏంటి? నిజంగా ఆ గుడిలో నిధి ఉందా? గురు వర్మ ఈ సమస్యను ఎలా పరిష్కరించాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు థియేటర్లో చూసి తెలుసుకోవాల్సిందే.
హైలైట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్..!
సబ్ ఇన్స్పెక్టర్గా సురేశ్ రవి ఆహార్యం బాగుంది, అతని ఇన్వెస్టిగేషన్ సీన్లు ఆకట్టుకుంటాయి. ఆర్కియాలజీ టీమ్‌లోని అఖిల పాత్రలో ఆశ వెంకటేష్ తన అందంతో, నటనతో మెప్పిస్తుంది. నిళల్గళ్ రవి, బోసే రవి, గ్రామ పెద్దతో పాటు ఇతర ఆర్కియాలజీ టీమ్ సభ్యులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక విభాగంలో, ఈ సినిమాకు ప్రధాన హైలైట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. సంగీత దర్శకుడు జెరాడ్ ఫిలిక్స్ సినిమా ఎక్కడా డౌన్ అవ్వకుండా తన సంగీతంతో నిలబెట్టాడు. ముఖ్యంగా శివుడిపై వచ్చే పాట ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పిస్తుంది. ‘అఖిల అఖిల’ పాట కూడా పెద్ద హీరోలకు పడాల్సిన పాటలా ఉంది. సినిమాటోగ్రఫీ పురాతన వాతావరణాన్ని చక్కగా చూపించింది. ఎడిటింగ్ పరంగా ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు ఇంకాస్త షార్ప్ చేసి ఉండవచ్చు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి. దర్శకుడు జీవీ పెరుమాళ్ వర్ధన్ ఈ కథను చాలా రీసెర్చ్ చేసి రాసుకున్నాడని స్పష్టమవుతుంది. సనాతన ధర్మాన్ని టచ్ చేస్తూ, ఎవరినీ బాధపెట్టకుండా కథను చెప్పిన విధానం ప్రశంసనీయం.

విశ్లేషణ: ఊహించని మలుపులు, సనాతన ధర్మం మేళవింపు
ఆర్కియాలజీ నేపథ్యంలో ఇంతకు ముందు చాలా సినిమాలు వచ్చాయి. కానీ ‘చంద్రేశ్వర’ ఆసక్తికరమైన కథ, స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సన్నివేశం ఈ సినిమాకు హైలైట్, ఇది సినిమాపై ఉత్కంఠను మరింత పెంచుతుంది. సినిమా ప్రారంభమే ఒక గొప్ప సినిమా చూస్తున్నామనే అనుభూతిని కలిగిస్తుంది. నందివర్మ, విషయ్ గౌడ ఎపిసోడ్స్ సినిమాకు బలం. వీటిని మిస్ అయితే కథ అర్థం కాదు.
‘ఒక రాజుని ఓడించాలంటే వారి ఆచార వ్యవహారాలపై దెబ్బకొట్టాలి’ వంటి డైలాగులు, సనాతన పద్ధతులు, చారిత్రక ఆధారాల ప్రస్తావన, విగ్రహాల మార్పిడి వంటి అంశాలు దర్శకుడి ఆలోచనా శక్తిని తెలియజేస్తాయి. గుడి విశిష్టత, అదృశ్య ఖడ్గం, నిధి కోసం అఖిల చెప్పే నాలుగు రహస్య దారులు వంటివన్నీ ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేస్తాయి.
సారాంశంగా చెప్పాలంటే, ఈ సినిమాలో కాస్త పేరున్న నటీనటులు ఉండి, ద్వితీయార్థంపై ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే ‘కార్తికేయ 2’ తరహాలో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించే అవకాశం ఉండేది. అయినప్పటికీ, ‘చంద్రేశ్వర’ థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకుడిని నిరాశపరచదు. సరైన ప్రచారం చేసుకుంటే, ఈ సినిమా ‘విజయేశ్వర’ గా మారే అవకాశం పుష్కలంగా ఉంది.
ట్యాగ్‌లైన్: ‘చంద్రేశ్వర’.. ‘విజయేశ్వర’
సినిమా పేరు: ‘చంద్రేశ్వర’
విడుదల తేదీ: జూన్ 27, 2025
నటీనటులు: సురేశ్ రవి, ఆశ వెంకటేష్, నిళల్గళ్ రవి తదితరులు
సంగీతం: జెరాడ్ ఫిలిక్స్
దర్శకత్వం: జీవీ పెరుమాళ్ వర్ధన్
రేటింగ్: 3.25/5.