డైలీ మిర్రర్ డాట్ న్యూస్, అక్టోబర్ 25, 2024: హైదరాబాద్‌లోని లక్డీకాపూల్ ప్రాంతంలో వరద ముప్పు నివారణకు అధికారులు కొత్తగా పైపులైన్ల ఏర్పాటు చేసేందుకు సరికొత్త ప్రణాళిక అమలు చేస్తున్నారు. శుక్రవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ అదనపు కమిషనర్ పి.విశ్వప్రసాద్, జీహెచ్ఎంసీ, జలమండలి, ట్రాఫిక్ అధికారులతో కలిసి లక్డీకాపూల్ ప్రాంతాన్ని పరిశీలించారు.
టెలిఫోన్ భవన్ నుండి మెహిదీపట్నం వైపు వెళ్లే మార్గంలో మ్యాన్‌హోళ్లను ఎయిర్‌టెక్ మెషిన్ ద్వారా పరిశీలించి, పైపులైన్లలో పేరుకున్న మురుగును, వ్యర్థాలను తొలగించారు.
శిథిలమైన పైపులైన్ల స్థానంలో కొత్త పైపులైన్లు: పాత పైపులైన్లు పగిలి, వరద నీటి ప్రవాహాన్ని నిరోధిస్తున్న నేపథ్యంలో, వీటి స్థానంలో కొత్త పైపులైన్లను నిర్మించాలని నిర్ణయించారు. వారం రోజుల్లోనే పనులు ప్రారంభించి, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నగరంలో వరద ముప్పు అధికంగా ఉన్న ఇతర ప్రాంతాలలో కూడా పరిష్కార చర్యలు చేపట్టి, రాబోయే వర్షాకాలానికి ముందు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని నిర్ణయించారు.
గత కొద్ది రోజులుగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేసి, సమస్య పరిష్కారానికి శ్రమిస్తున్న అధికారులను స్థానికులు ప్రశంసించారు. “20 ఏళ్లుగా ఉన్న వరద సమస్యను తీరుస్తున్నందుకు స్థానిక వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
లక్డీకాపూల్ ప్రాంతంలోని పురాతన పైపులైన్ల సమస్య వల్లే వరద నీరు నిలిచి, తమ దుకాణాలకు హాని కలుగుతుందని వ్యాపారులు వాపోయారు. ఎట్టకేలకు, ఈ సమస్యను పరిష్కరించేందుకు తీసుకుంటున్న అధికారుల చర్యలను స్థానికులు హర్షిస్తున్నారు.