
డైలీ మిర్రర్ డాట్ న్యూస్,నవంబర్ 27,2024: ఎర్రచందనం అమ్మకాలు, ఎగుమతుల ప్రక్రియను సింగిల్ విండో విధానంలో మారుస్తే, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ‘ఈ-వేలం’ ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కి తెలిపారు.
ఢిల్లీలో పర్యటిస్తున్నప్పుడు బుధవారం భూపేంద్ర యాదవ్ తో సమావేశమై, ఎర్రచందనం రక్షణ, స్మగ్లింగ్ నిరోధం, దుంగల అమ్మకం వంటి అంశాలపై చర్చించారు.
పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చిన అంశాలు: “బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల ప్రతిపాదించినట్లు, ఎర్రచందనం అమ్మకాలు, ఎగుమతులు సింగిల్ విండో విధానంతో జరిపితే సమర్థంగా జరుగుతుంది.

ఈ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ కస్టోడియన్ గా నిర్వహించవచ్చు. అటు ఎర్రచందనం గ్రేడింగ్, వేలం, ఎగుమతులు కూడా ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఆధ్వర్యంలో జరగాలి. ఈ విధానం ద్వారా రెవెన్యూ పెరుగుతుంది.
ఏ రాష్ట్రంలో పట్టుబడిన ఎర్రచందనం అయినా…
ఎర్రచందనం అనేది అరుదైన వృక్ష సంపద. ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అటవీ ప్రాంతంలో పెరుగుతుంది. కాబట్టి, కేంద్రం నిబంధనలను సవరించి, ఆంధ్రప్రదేశ్ వెలుపల పట్టుబడిన ఎర్రచందనం కూడా సింగిల్ విండో ద్వారా అమ్మకానికి వచ్చేటట్లు చూడాలి.

ఈ విధంగా ఏ రాష్ట్రం పట్టుబడిన ఎర్రచందనాన్ని ఆ రాష్ట్రం అమ్ముకోవడానికి వీలుకాదు. అమ్మకాలు,ఎగుమతులు ఒకే విధానంలో కొనసాగుతాయి. ఈ విధానం ద్వారా, కేంద్ర పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కస్టోడియన్ గా కొనసాగుతుంది’’ అని పవన్ కళ్యాణ్ వివరించారు.