
డైలీ మిర్రర్ డాట్ న్యూస్,చెన్నై, ఆగస్టు 24: ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ తొలి రౌండ్ శనివారం ఇక్కడి మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో ఘనంగా మొదలైంది. ఇందులో భాగంగా నాటకీయ పరిణామాలతో, అనూహ్య మలుపులు తిరుగుతూ సాగిన ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్‌ఎల్), ఫార్ములా 4 ఇండియన్ చాంపియన్‌షిప్ ఆరంభ రేసుల్లో ఇంగ్లండ్‌కు చెందిన వెటరన్ జోన్ లాంకాస్టర్, షిల్లాంగ్‌కు చెందిన 17 ఏళ్ల జాడెన్ రెహమాన్ పరియాట్ విజేతలుగా నిలిచారు.
ఎ–లెవెల్ డ్రైవర్ల కోసం నిర్వహిస్తున్న ఐఆర్‌ఎల్ రేస్–1లో చెన్నై టర్బో రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న జోన్ లాంకాస్టర్ 27 నిమిషాల 15.812 సెకన్లతో అందరికంటే ముందుగా రేసును పూర్తి చేశాడు. ఎఫ్–4 ఇండియన్ చాంపియన్‌షిప్‌లో బెంగళూరు స్పీడ్‌స్టర్స్ డ్రైవర్ జాడెన్ 27 నిమిషాల 14.967 సెకన్లతో అగ్రస్థానంతో పోడియంపైకి వచ్చాడు. కాగా, ఈ రెండు ఈవెంట్లలో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ జట్టు నిరాశ పరిచింది.

ఓ దశలో సులువుగా ఎఫ్4 ఇండియన్ చాంపియన్‌షిప్ రేసులో విజయం సాధించేలా కనిపించిన బ్లాక్‌బర్డ్స్ డ్రైవర్ హ్యూ బార్టర్ రిటైర్ అయ్యాడు. తన తొలి పొజిషన్‌ను బెంగళూరు స్పీడ్‌స్టర్స్ రేసర్ పరియాట్‌కు ఇచ్చేశాడు. ఐఆర్‌ఎల్‌లో మరో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ డ్రైవర్, స్విటర్జాండ్ దిగ్గజం నీల్ జానీ కనుచూపు మేరలో ఉన్న విజయాన్ని లాంకాస్టర్ (చెన్నై టర్బో రైడర్స్)కి చేజార్చుకొని నిరాశ పరిచాడు.
కాగా, శ్రాచి రార్ బెంగాల్ టైగర్స్‌కు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న బెంగళూరు యువకుడు రుహాన్ అల్వా ఐఆర్ఎల్, ఎఫ్4 ఇండియా చాంపియన్‌షిప్ రెండు రేసుల్లోనూ మూడో స్థానంతో పోడియంపైకి వచ్చి ప్రశంసలు అందుకున్నాడు.