డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్, నవంబర్ 26,2025: పాల కొరతతో సతమతమవుతున్న దేశాన్ని ప్రపంచంలోనే నంబర్‌వన్ పాల ఉత్పత్తిదారుగా మార్చిన శ్వేత విప్లవ నిర్మాత, ‘భారత మిల్క్‌మ్యాన్’ డాక్టర్ వర్గీస్ కురియన్ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ రోజు జాతీయ పాల దినోత్సవం ఘనంగా జరుపుకుంటోంది. లక్షలాది మంది రైతులకు ఆర్థిక స్వాతంత్ర్యం అందించిన ఆ మహానీయుడిని స్మరించుకుంటూనే… భారత పాడి రంగం ఇప్పుడు కొత్త లక్ష్యాల వైపు దూసుకెళ్తోంది.
పరిమాణం నుంచి నాణ్యతకు… ఉత్పత్తి నుంచి పోషకాహారానికి
గతంలో లక్ష్యం ఒక్కటే – దేశంలో పాలు సరిపడా ఉత్పత్తి కావాలి. ఇప్పుడు దృష్టి మారింది. ఎంత పాలు ఉత్పత్తి అవుతున్నాయి కాదు… ఆ పాలు ఎంత పోషకంగా, ఎంత నాణ్యంగా, ఎంత స్థిరంగా ఉన్నాయి అనేదే ప్రశ్నగా మారింది. గోద్రేజ్ జెర్సీ మార్కెటింగ్ హెడ్ శాంతను రాజ్ మాట్లాడుతూ, “ఇప్పుడు మనం పోషక విప్లవం దశలోకి అడుగుపెట్టాం. ఆరోగ్యం, స్థిరత్వం, ఆవిష్కరణలే భవిష్యత్ దిశ” అని స్పష్టం చేశారు.
వినియోగదారుడి రుచి మారింది

ఇటీవలి సర్వేల ప్రకారం భారతీయులు ఆహారం ఎంచుకునేటప్పుడు ముందుగా లేబుల్ చూస్తున్నారు. అధిక ప్రోటీన్, స్వచ్ఛత, నైతిక సేకరణ, స్పష్టమైన ట్రేసబిలిటీ – ఇవే కొత్త డిమాండ్. పాలు ఇక కేవలం ఆహారం కాదు… ఆరోగ్య ప్యాకేజీగా మారాయి.
విలువ ఆధారిత ఉత్పత్తులకు భారీ గిరాకీ
పట్టణీకరణ, ఫిట్‌నెస్ అవగాహన పెరగడంతో రుచిగల పాలు, ప్రోబయోటిక్ పెరుగు, అధిక ప్రోటీన్ షేక్స్, పనీర్, చీజ్‌లకు డిమాండ్ ఆకాశాన్నంటుతోంది. భారతీయ ఆహారంలో ప్రోటీన్ లోపం ఉండటంతో ఈ ఉత్పత్తులు ఆ ఖాళీని నింపుతున్నాయి. యువతకు పాల ఉత్పత్తులంటే ఇక సంప్రదాయం కాదు… రుచి + ఆరోగ్యం + సౌలభ్యం కలగలిసిన ఆధునిక ఎంపిక.
సాంకేతికత – పాడి రంగంలో కొత్త యుగం
పొలం నుంచి ఫ్రిజ్ వరకు ప్రతి చుక్క పాలు ఇప్పుడు డిజిటల్‌గా ట్రాక్ అవుతున్నాయి. ఐఓటీ, ఏఐ, డిజిటల్ ట్రేసబిలిటీ సిస్టమ్స్ తాజాదనం, నాణ్యత, భద్రతను హామీ ఇస్తున్నాయి. రైతులకూ లాభం – డేటా ఆధారిత సలహాలతో పశువుల ఆరోగ్యం మెరుగై, దిగుబడి పెరిగి, ఆదాయం పెరుగుతోంది.
స్థిరమైన భవిష్యత్తు కోసం సహకారం అవసరం

ప్రభుత్వం, పరిశ్రమ, పరిశోధన సంస్థలు కలిసి పనిచేస్తేనే స్థిరమైన పాడి రంగం సాధ్యమని నిపుణుల అభిప్రాయం. నాణ్యతా ప్రమాణాలు, పర్యావరణ అనుకూల విధానాలు, రైతుల శిక్షణ, పరిశోధనలకు పెట్టుబడి పెంచాల్సిన అవసరం ఉంది.
శ్వేత విప్లవం దేశానికి పాలు ఇచ్చింది. ఇప్పుడు పోషక విప్లవం ఆరోగ్యం, సంపద, స్థిరత్వం ఇవ్వబోతోంది. ఈ జాతీయ పాల దినోత్సవం ఆ కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టనుంది

