డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్, 26 నవంబర్ 2025: భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్లలో ఒకటిగా పేరుగాంచిన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధితుల ఐదేళ్ల మనుగడ రేటు కేవలం 3 శాతం మాత్రమేనని అపోలో హాస్పిటల్స్ మెడికల్ ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ నిఖిల్ సురేష్ ఘద్యల్పాటిల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అన్ని రకాల క్యాన్సర్లలోనే అత్యల్ప మనుగడ రేటు అని ఆయన పేర్కొన్నారు.

దేశంలో సుమారు 43 శాతం రోగులకు ఈ క్యాన్సర్ 4వ దశలోనే గుర్తించబడుతోంది. ఆ దశలో క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించి ఉండటంతో చికిత్స అత్యంత క్లిష్టమవుతుందని వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స, కీమోథెరపీ చేయించుకున్నా క్యాన్సర్ తిరిగి వచ్చే ప్రమాదం ఎక్కువగానే ఉంటుంది. అలాంటి రోగుల మనుగడ రేటు కూడా 12-15 శాతం మాత్రమే.

“ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను ఇప్పటికీ సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం. దీనిపై తగినంత అవగాహన, పరిశోధన, ప్రభుత్వ మద్దతు లేకపోవడంతో దీన్ని ‘నిర్లక్ష్యానికి గురైన క్యాన్సర్’ అని పిలుస్తున్నాం” అని డాక్టర్ నిఖిల్ హెచ్చరించారు.

ప్రారంభ లక్షణాలు… కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు!

  • నిరంతర కడుపు లేదా వెన్నునొప్పి
  • ఆకస్మిక బరువు తగ్గడం
  • కామెర్లు (పసుపు రంగు మారడం)
  • ఆకలి లేకపోవడం
  • జీర్ణకోస సమస్యలు
  • కొత్తగా వచ్చిన మధుమేహం

“ఈ లక్షణాలు కనిపించినా చాలా మంది వాటిని సాధారణంగా తీసిపారేస్తారు. రోగులు మా వద్దకు వచ్చేసరికి క్యాన్సర్ ఆఖరి దశలో ఉంటుంది. అప్పుడు బ్రతికే అవకాశం కేవలం 3 శాతమే మిగులుతుంది” అని డాక్టర్ నిఖిల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ప్యాంక్రియాస్ శరీరంలో లోతుగా ఉండటం, సాధారణ స్క్రీనింగ్ పరీక్షల్లో సులువుగా గుర్తించడం కష్టం కావడం ఈ క్యాన్సర్ ఆలస్యంగా బయటపడటానికి ప్రధాన కారణాలు.

వైద్యుల పిలుపు: ఇక నిర్లక్ష్యం కూడదు!

  • ప్రభుత్వం, పరిశోధనా సంస్థలు, ఆసుపత్రులు, నిధుల సంస్థలు కలిసి పనిచేయాలి
  • ముందస్తు గుర్తింపు సాధనాలు, కొత్త చికిత్సల కోసం భారీ పెట్టుబడులు పెట్టాలి
  • ఎక్కువ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలి
  • ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు తీవ్రతరం చేయాలి

“ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను ఇకపై విస్మరించలేం. సమిష్టి కృషితో మనుగడ రేటును పెంచవచ్చు… కుటుంబాలకు ఆశను అందించవచ్చు” అని డాక్టర్ నిఖిల్ పిలుపునిచ్చారు.

ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి…

  • ధూమపానం పూర్తిగా మానేయండి
  • మధుమేహాన్ని సక్రమంగా నియంత్రించండి
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి
  • ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి

వైద్యులు హెచ్చరిస్తున్నారు – ఈ ‘నిశ్శబ్ద హంతకుడు’ని ఆపాలంటే అవగాహన, ముందస్తు పరీక్షలే ఏకైక మార్గం!