డైలీ మిర్రర్ డాట్ న్యూస్,నవంబర్ 26,2024: పంచాయతీరాజ్ వ్యవస్థను సమ్మిళతంగా ఒకే గొడుగు కింద తీసుకు రానున్న రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ (ఆర్జీఎస్ఏ) ప్రోగ్రామ్ కింద 2021 నుంచి ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి అందాల్సిన నిధులు కొన్ని కారణాల వల్ల ఇవ్వబడలేదు.

ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజిత్ సింగ్ తో ఢిల్లీ పర్యటనలో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా, పంచాయతీరాజ్ నిధులపై, కేంద్ర ప్రోత్సాహకాలు, సహకారం,ముఖ్యమైన అంశాలపై చర్చలు జరిగినాయి.

ప్రధాన ప్రతిపాదనలు:

  1. రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ యోజన కింద 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ₹215.8 కోట్లను కేంద్రానికి ప్రతిపాదించింది.
  2. 2021 తరువాత రాష్ట్రానికి ఈ పథకం కింద నిధుల విడుదల ఆగిపోయింది. కానీ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం 40% మ్యాచింగ్ గ్రాంటు అందించడానికి సిద్ధంగా ఉంది, అలాగే బ్యాక్‌లాగ్ నిధులకు ₹42.26 కోట్లు అందించడానికి కూడా సిద్ధంగా ఉంది.
  3. మొదటి విడతగా ₹107.90 కోట్లను వెంటనే విడుదల చేయాలని, 3 లక్షల మంది ఉద్యోగులకు శిక్షణ, 2 డీపీఆర్సీ భవనాల నిర్మాణం, 200 గ్రామ పంచాయతీ భవనాలు, 500 మారుమూల గ్రామ పంచాయతీలకు కంప్యూటర్లు ఏర్పాటు చేయడానికి ఈ నిధులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
  4. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఏపీఎస్ఐఆర్డీపీఆర్)కు శాశ్వత భవనం లేదని, దీని నిర్మాణం కోసం ₹20 కోట్లు ఇవ్వాలని కూడా కోరారు.

కేంద్రానికి కృతజ్ఞతలు
15వ ఆర్థిక సంఘం నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది. సెప్టెంబరులో మొదటి విడతగా ₹998.74 కోట్లు విడుదల చేసినందుకు ఆనందం వ్యక్తం చేశారు. రెండో విడత నిధుల కోసం ₹1052.46 కోట్లను ప్రతిపాదించారని, అలాగే గతంలో పెండింగ్ లో ఉన్న ₹63.73 కోట్లు కూడా రెండో విడత నిధులతో విడుదల చేయాలని కోరారు.