డైలీ మిర్రర్ డాట్ న్యూస్,జూన్ 26, 2026: నటీనటులు: సందీప్ అశ్వ, సాన్యా ఠాకూర్, జోయా జవేరి, రాజీవ్ కనకాల, అనీష్ కురువిల్లా తదితరులు

సంగీతం, దర్శకత్వం: ఘంటాడి కృష్ణ

ఛాయాగ్రహణం: జగదీష్ కొమరి

కూర్పు: శివ శర్వాణి

నిర్మాతలు: ఘంటాడి కృష్ణ, గుర్రం నర్సింహులు, రావి సురేష్ రెడ్డి

విడుదల తేదీ: జూన్ 26, 2026

కథాంశం:

కార్తీక్ (సందీప్ అశ్వ) తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఈజీ మనీ కోసం చిన్నపాటి మోసాలకు పాల్పడుతుంటాడు. ఈ క్రమంలోనే మాజీ మిస్ ఇండియా సందలి అరోరా (జోయా జవేరి)ని బుట్టలో వేసుకోవడానికి మ్యూజిక్ వీడియో మేకర్స్ అవతారమెత్తుతారు.

Read this also:Sangeetha Vidhvaan Akella Mallikarjuna Sharma gaari 88th Jayanthi & Sri Gururaja Music Institute Anniversary 2026

అయితే, వీరి ప్లాన్ రివర్స్ అవుతూ.. సందలి తన భర్త ప్రదీప్ చక్రవర్తి (అనీష్ కురువిల్లా)ని హతమార్చాలనే సుపారీని ఈ నలుగురి చేతిలో పెడుతుంది. అసలు సందలి తన భర్తను ఎందుకు వదిలించుకోవాలనుకుంది? ఆ ప్రమాదకరమైన ‘రిస్క్’ డీల్‌కు కార్తీక్ గ్యాంగ్ ఒప్పుకుందా? చివరికి ఈ యువకుల జీవితాలు ఏ మలుపు తిరిగాయి? అనేదే మిగతా సినిమా.

విశ్లేషణ:

సంగీత దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన ఘంటాడి కృష్ణ.. ఈ చిత్రంతో మెగాఫోన్ పట్టి దర్శకుడిగా సరికొత్త అవతారమెత్తారు. యువతను ఆకట్టుకునే క్రైమ్, లవ్ అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో ఆయన రాసుకున్న కథాంశం మెప్పిస్తుంది.

నేటి తరం నిరుద్యోగులను ఆసరాగా చేసుకుని సాగే ‘బ్యాక్ డోర్ జాబ్స్’ కన్సల్టెన్సీ మోసాల నేపథ్యంతో సినిమాను ఆసక్తికరంగా ప్రారంభించారు. కార్తీక్ ఆఫీస్ పెట్టడం, అర్హత లేని వారికి కూడా పెద్ద ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించే సీన్లు వినోదాన్ని పంచుతాయి. ప్రథమార్ధం సరదాగా సాగిపోగా.. ద్వితీయార్ధంలో క్రైమ్ ఎలిమెంట్స్ తోడై కథ వేగం పుంజుకుంటుంది.

నటీనటుల విషయానికొస్తే, కొత్తవారైనా సందీప్ అశ్వ, హీరోయిన్లు సాన్యా ఠాకూర్, జోయా జవేరి తమ పరిధి మేర చక్కగా నటించారు. కీలక పాత్రలో కనిపించిన సీనియర్ నటుడు రాజీవ్ కనకాల తన అనుభవంతో సినిమాకు బలాన్ని చేకూర్చారు. యువ నటులతో ఆయనకు మధ్య వచ్చే సన్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

సాంకేతిక వర్గం:

దర్శకుడిగా మొదటి ప్రయత్నమే అయినా ఘంటాడి కృష్ణ స్క్రీన్‌ప్లేను గ్రిప్పింగ్‌గా నడిపించడంలో సఫలమయ్యారు. తనే స్వయంగా అందించిన సంగీతం, ముఖ్యంగా కొన్ని పాటలు వినసొంపుగా ఉన్నాయి. జగదీష్ కొమరి కెమెరా పనితనం పర్వాలేదనిపిస్తుంది. శివ శర్వాణి ఎడిటింగ్ ద్వితీయార్ధంలో ఇంకాస్త పదునుగా ఉంటే సినిమా మరింత వేగంగా సాగేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా బాగున్నాయి.

ఎలాంటి అసభ్యత లేకుండా, సస్పెన్స్ ,యూత్‌ఫుల్ ఎలిమెంట్స్‌తో సాగే ‘రిస్క్’ చిత్రాన్ని ఈ వీకెండ్‌లో కుటుంబ సమేతంగా థియేటర్‌లో హ్యాపీగా వీక్షించవచ్చు.

రేటింగ్: 3/5