
“క్షేమ కిసాన్ సాథి”తో గ్రామీణ, వ్యవసాయ వర్గాలకు ఆర్థిక భద్రత
డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్, జూలై 2, 2025:కరూర్ వైశ్యా బ్యాంక్ (కేవీబీ), క్షేమ జెనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ సంయుక్తంగా ఒక కీలక బ్యాంకెష్యూరెన్స్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా “క్షేమ కిసాన్ సాథి” పేరుతో గ్రామీణ, వ్యవసాయ వినియోగదారులకు ప్రత్యేకమైన బీమా పథకాన్ని అందించనున్నారు.
కేవీబీకి గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో ఉన్న విస్తృత నెట్‌వర్క్, క్షేమకు ఉన్న టెక్నాలజీ ఆధారిత బీమా పరిష్కారాలతో మిళితమై, కోట్లాది మంది కస్టమర్లకు సమగ్ర ఆర్థిక భద్రతను అందించేలా ఈ భాగస్వామ్యం ముందుకు వెళ్తుంది.
కరూర్ వైశ్యా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ రమేష్ బాబు మాట్లాడుతూ,“గ్రామీణ ప్రాంతాల్లో కస్టమర్లు ఎదుర్కొనే సమస్యలను బాగా అర్థం చేసుకున్నాం. క్షేమ కిసాన్ సాథి ద్వారా కేవలం బీమా ప్రొటెక్షన్ కాకుండా, ఆత్మస్థైర్యాన్ని, స్థిరమైన జీవనోపాధిని అందించాలనే లక్ష్యం పెట్టుకున్నాం.”

క్షేమ జెనరల్ ఇన్సూరెన్స్ చైర్మన్ నటరాజ్ నూకల తెలిపారు,“ఈ నూతన బీమా పథకం రైతులకు, అగ్రి ఎంట్రప్రెన్యూర్లకు పంట బీమా, వ్యక్తిగత ప్రమాద భీమా వంటి రెండు విధాల రక్షణ కల్పిస్తుంది. అలాగే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం, స్వావలంబన ఇచ్చేలా రూపొందించాం.”
క్షేమ కిసాన్ సాథి పథకం ప్రధానంగా శాటిలైట్ ఇమేజ్‌లు, ఏఐ ఆధారిత రిస్క్ అసెస్‌మెంట్, రియల్ టైమ్ డేటా మోడలింగ్ వంటి అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకుని, ముందస్తు అంచనాలు వేసే విధంగా పని చేస్తుంది. ఇలా బీమా పథకాన్ని మరింత వేగవంతం, పారదర్శకంగా, వ్యక్తిగతీకరించిన రీతిలో గ్రామీణ వినియోగదారులకు చేరువ చేస్తుంది.
రాబోయే రోజుల్లో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల వరకు కూడా బీమా చేరేలా ప్రభుత్వ, IRDAI లక్ష్యాలకు అనుగుణంగా ఈ ఒప్పందం తోడ్పడనుంది. కేవీబీ, క్షేమ జెనరల్ ఇన్సూరెన్స్ మధ్య ఉన్న ఈ భాగస్వామ్యం, కేవలం వ్యాపార పరమైనది కాకుండా, రైతులు, గ్రామీణ వర్గాల ఆర్థిక సాధికారతకు రక్షణ కవచం అవుతుందని తెలుస్తోంది.