డైలీ మిర్రర్ డాట్ న్యూస్,మంగళగిరి, ఏప్రిల్ 13,2026: బీసీ హక్కుల సాధన కోసం ఆమరణ నిరాహార దీక్షకు దిగిన బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన చేపట్టిన ‘ధర్మదీక్ష’ సోమవారం నాటికి మూడో రోజుకు చేరుకుంది. ఆహారం తీసుకోకపోవడంతో ఆయన శరీరం సహకరించడం లేదని, పరిస్థితి విషమిస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

పడిపోతున్న గ్లూకోజ్ స్థాయిలు
రామచంద్ర యాదవ్‌ను పరీక్షించిన వైద్య బృందం ఆయన ఆరోగ్య నివేదికను విడుదల చేసింది. శరీరంలో ఎలక్ట్రోలైట్స్, కాల్షియం, మెగ్నీషియం ,గ్లూకోజ్ స్థాయిలు గణనీయంగా పడిపోయాయని వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి..బీసీల ఐక్యతే హక్కుల సాధనకు మార్గం: బోడె రామచంద్ర యాదవ్..

ఇదీ చదవండి..ఓట్ల వేళ ‘ప్రేమ’.. గెలిచాక ‘నిర్లక్ష్యం’: బీసీ రాజ్యాధికార పోరాటం ఫలిస్తుందా?

ఆక్సిజన్ సాచురేషన్ స్థాయిలు కూడా తగ్గే ప్రమాదం ఉందని, తక్షణమే వైద్య చికిత్స అవసరమని సూచించారు. అయితే, బీసీల డిమాండ్లు నెరవేరే వరకు తన పోరాటం ఆగదని రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు.

ప్రధాన డిమాండ్లు ఇవే..
బీసీల అభ్యున్నతి కోసం ఆయన ప్రభుత్వం ముందు పలు డిమాండ్లను ఉంచారు:

చట్టసభల్లో రిజర్వేషన్లు: విద్య, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థలు, చట్టసభల్లో బీసీలకు 44 శాతం రిజర్వేషన్లు కల్పించాలి.

కుల గణన: రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర కుల గణనను తక్షణమే చేపట్టాలి.

భూ కేటాయింపు: అమరావతిలో బీసీల కోసం వెయ్యి ఎకరాల భూమిని కేటాయించాలి.

ప్రత్యేక చట్టం: బీసీల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావడంతో పాటు కార్పొరేషన్లకు నిధులు పెంచాలి.

వెల్లువెత్తుతున్న మద్దతు
రామచంద్ర యాదవ్ చేపట్టిన ఈ దీక్షకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఇప్పటికే బి.పి. మండల్ మనుమడు సూరజ్ మండల్, జ్యోతిబాపూలే మునిమనుమడు రమాకాంత్ పూలే మంగళగిరి చేరుకుని సంఘీభావం ప్రకటించారు.

మాజీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలిపారు.

తెలగ-కాపు-బలిజ జేఏసీ చైర్మన్ దాసరి రాము, అఖిల భారత యాదవ సంఘం నేతలు బుసగాని లక్ష్మయ్య తదితర 40కి పైగా కుల సంఘాల ప్రతినిధులు దీక్షా శిబిరాన్ని సందర్శించి తమ మద్దతును ప్రకటించారు.

రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు రామచంద్ర యాదవ్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తున్నాయి.